Begin typing your search above and press return to search.

లాఠీఛార్జ్ మీద లెంపలేసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   19 Aug 2015 4:22 AM GMT
లాఠీఛార్జ్ మీద లెంపలేసుకుంటున్నారు
X
ఉద్యోగ నిర్వహణ భాగంగా వ్యక్తిగత త్యాగాలు చేసి మరీ.. దేశ రక్షణలో పాలు పంచుకున్న మాజీ సైనికుల పట్ల ఈ దేశం ఎలా వ్యవహరించాలి? వారి పట్ల మర్యాదను.. గౌరవాన్ని ఎంతివ్వాలి? న్యాయమైన డిమాండ్లతో గళం విప్పే వరకు చోద్యం చూస్తున్నట్లు ఉండిపోయి.. వారి ఆందోళన తీవ్రతరమైన సమయంలో చప్పున గుర్తుకొచ్చినట్లుగా వ్యవహరించి.. సానుకూల ప్రకటన ఏమీ చేయకుండానే వారి ఆందోళనను నిలిపివేయాలని కోరటం న్యాయమేనా? అంటే కాదని ఎవరైనా అంటారు.

ఘనత వహించిన కేంద్రం ఇదే తీరులో వ్యవహరించి వైనం గురించి తెలిసిందే. ఒకే హోదా.. ఒకే పింఛన్ ను కోరుతూ మాజీ సైనికోద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తమ న్యాయమైన కోరిక మీద స్పందించిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. దేశ రాజధాని ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షను ఆగస్టు 14న బలవంతంగా భగ్నం చేసిన ఉదంతంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగటం తెలిసిందే.

మాజీ సైనికుల పట్ల.. పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ పై పెద్ద ఎత్తున విమర్శలు చోటు చేసుకున్న నేపథ్యంలో నష్టనివారణ చర్యల్ని ప్రభుత్వం మొదలు పెట్టింది. ఇందులోభాగంగా.. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఎంకే మీనా మాజీ సైనికోద్యోగుల పట్ల సానుభూతి ప్రదర్శించి..ఆగస్టు 14న చోటు చేసుకున్న పరిస్థితులపై ఆయన సారీ చెప్పుకొచ్చారు.

తమను క్షమించాలని.. తమకు మాజీ సైనికుల మీద ఎలాంటి ద్వేషం లేదని.. ఎంతో గౌరవం ఉందని.. తాము కూడా సైనికుల చెంతనే ఉంటామని.. తాము చేసిన పనికి తామిప్పుడు బాధ పడుతున్నామంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సైనికులుగా పని చేస్తున్న వారైనా.. మాజీ సైనికులైనా.. తమకెంతో గౌరవమని ఆయన చెబుతున్నారు. ఒకే హోదా.. ఒకే పెన్షన్ పై కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ హామీ ఇచ్చి.. ఈ నెల 24 నాటికి ఈ అంశాన్ని పరిష్కరిస్తానని.. వెంటనే నిరసన దీక్షను ముగించాలంటూ చెప్పినా.. కొనసాగించిన నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయని.. వాటికి తాను చింతిస్తున్నట్లగా మీనా పేర్కొన్నారు.

విషయాన్ని నాన్చకపోతే.. మాజీ సైనికులు రోడ్ల మీదకు రావాల్సిన అవసరమే లేదుగా. విధి నిర్వహణలో.. ఇంటికి దూరంగా ఉంటూ.. సరిహద్దుల్లోని కఠిన వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని.. పొరుగు దేశాల దుశ్చర్యల్ని కంటికి రెప్పలా కాపాడిన వారి విషయం ప్రభుత్వం ఎంత శ్రద్ధ వహించాలి? వారికి సంబంధించిన న్యాయమైన కోర్కెల విషయంలో పోరాటం చేసే వరకు అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వాన్ని తప్పు పట్టాల్సిందే.

ఆందోళన స్టార్ట్ చేసి.. ఉధృతం అవుతున్న వేళ.. ఏదో ఒక హామీ ఇచ్చేసి నిరసనను ఆపేయమంటే.. ఆపేస్తారా? తమ మాట వినలేదన్న ఈగోతో తమకున్నఅధికారబలాన్ని ప్రదర్శించి చావబాదటం.. ఇలా సారీలు చెప్పటం ‘‘పవర్’’ చేతిలో ఉన్న వారికి మామూలైపోయింది. మాజీ సైనికుల మీద ఎంతో ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతున్న మీనా లాంటి అధికారులు.. వారి నిరసన సందర్భంగా గౌరవప్రదంగా ఎందుకు వ్యవహరించలేదన్న ప్రశ్నకు ఏం సమాధానం చెబుతారు?