Begin typing your search above and press return to search.
ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు: ఆర్మీలో ఉద్యోగమా? ఫేస్ బుక్ తేల్చుకో
By: Tupaki Desk | 16 July 2020 12:30 AM GMTఇప్పటివరకూ ఎప్పుడూ లేని రీతిలో ఢిల్లీ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక కేసు విచారణలో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. భారత సైన్యంలో పని చేసే వారంతా తమ సోషల్ మీడియా ఖాతాల్ని డిలీట్ చేయాలంటూ ప్రభుత్వం ఇటీవల ఒక నిర్ణయాన్ని ప్రకటించటం తెలిసిందే.ఈ నిర్ణయం నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఒక సైనికాధికి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.
‘‘దేశ భద్రత చాలా ముఖ్యం. కావాలంటే సైన్యం నుంచి బయటకు వచ్చాక ఒక కొత్త ఫేస్ బుక్ ఖాతాను ఏర్పాటు చేసుకోవచ్చు. అప్పుడు ఆ ఖాతా పాత దాని మాదిరే పని చేస్తుంది. దేశ భద్రతపై ఆందోళన రేగుతున్న వేళ.. ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఇచ్చే ప్రసక్తే లేదు’’ అని కోర్టు వ్యాఖ్యలు చేసింది.
కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కేసు వేసిన లెఫ్టినెంట్ కల్నల్ పీకే చౌదరీ తన వాదనలు వినిపిస్తూ.. ఫేస్ బుక్ ఖాతాను డిలీట్ చేస్తే.. డేటా.. ఫ్రెండ్స్ కంటెంట్ ను శాశ్వితంగా కోల్పోతానని పేర్కొన్నారు. తనకు జరిగే నష్టం పూడ్చలేనిదన్నారు. ఈ వ్యాఖ్యలపై కోర్టు తీవ్రంగా స్పందించింది. కీలకమైన సంస్థలో భాగమైన వారు సంస్థ చెప్పినట్లుగా నడుచుకోవాలని.. ఒకవేళ ఫేస్ బుక్ మరీ అంత ఇష్టమైతే ఉద్యోగానికి రాజీనామా చేయొచ్చని స్పష్టం చేశారు. ‘‘ఉద్యోగమా? ఫేస్ బుక్ లో ఖాతానా? ఈ రెండింటిలో ఏది ముఖ్యమో తేల్చుకోండి. సోషల్ మీడియాలో మీరు ఖాతా ఏర్పాటు చేసుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది’’ అని స్పష్టం చేసింది.
ఈ కేసుకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడిషినల్ సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ తన వాదనలు వినిపిస్తూ.. ఇటీవల తాము ఫేస్ బుక్ లో ఒక బగ్ కనుక్కున్నట్లు చెప్పారు. సైబర్ వార్ లో వినియోగించే దాని వల్లే ఆ బగ్ పని చేస్తుందని.. దీని ద్వారా సైన్యంలోని చాలామంది ప్రతినిధుల్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరందరి వాదనలు విన్న అనంతరం కోర్టు స్పందిస్తూ.. సైన్యం పాలసీని తాము పరిశీలిస్తామని.. తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని చెబుతూ.. కేసును ఈ నెల 21కు వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.