Begin typing your search above and press return to search.

నిర్భయ దోషులు అవయువ దానానికి కోర్టు నో

By:  Tupaki Desk   |   12 Jan 2020 3:32 AM GMT
నిర్భయ దోషులు అవయువ దానానికి కోర్టు నో
X
దారుణ నేరానికి పాల్పడిన నిర్భయ దోషుల అవయువదానానికి కోర్టు నో చెప్పేసింది. త్వరలో వారిని ఉరి తీసేందుకు వీలుగా ఇప్పటికే ఆదేశాలు జారీ కావటమే కాదు.. వారికి ఉరిశిక్ష విదించేందుకు ఏర్పాట్లు సాగుతున్న వేళ.. ఒక స్వచ్చంద సంస్థ ఢిల్లీ కోర్టు ముందుకు వచ్చింది. అవయువ దానం గొప్పతనం గురించి.. దాతలను ఒప్పించే పనులు చేసే ఒక ఎన్జీవో తాజాగా కోర్టు ముందుకొచ్చి.. నిర్భయ దోషులను అవయువ దానాలు చేసేందుకు వీలుగా వారితో కలిసి మాట్లాడేందుకు అనుమతిని ఇవ్వాలని కోర్టును కోరింది.

2012లో నిర్భయను అత్యంత దారుణంగా.. క్రూరంగా కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారం చేసిన కేసులో బతికి ఉన్న నలుగురికి ఉరిశిక్ష త్వరలో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడిన నలుగురు (ముకేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్) ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.

ఈ నెల 22న ఉదయం ఏడు గంటల వేళలో వారికి ఉరిశిక్షను అమలు చేయనున్నారు. వారు మరణించిన తర్వాత వారి అవయువాల్ని దానం చేసేందుకు వీలుగా వారిని కలిసి ఒప్పించాలన్నది సదరు ఎన్జీవో ఆలోచన. అయితే.. దీన్ని కొట్టిపారేసింది ఢిల్లీ కోర్టు. అవయువ దానం చేసేందుకు వీలుగా నిర్భయ దోషుల్ని ఒప్పించాలనుకున్న ఎన్జీవో ప్రతిపాదనలో పస లేదని చెప్పిన కోర్టు.. నిర్భయ దోషుల్ని దరఖాస్తుదారులు కలుసుకోవాల్సిన అవసరం లేదని తేల్చింది. నిర్భయ దోషుల్ని కలిసేందుకు వీలుగా అధికారులకు తాము ఆదేశాలు జారీ చేయమని చెప్పలేమంటూ కోర్టు పిటిషన్ ను డిస్మిస్ చేసేసింది.