Begin typing your search above and press return to search.

మన కళ్ల ముందు తిరిగే మానవబాంబులెన్నో..?

By:  Tupaki Desk   |   3 Feb 2016 4:22 PM GMT
మన కళ్ల ముందు తిరిగే మానవబాంబులెన్నో..?
X
మానవ బాంబుల్ని తీవ్రవాదులు ప్రయోగిస్తుంటారు. వారి మీద సాధారణ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని.. అసహ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. కంటికి కనిపించని మానవ బాంబులు ఎప్పుడు.. ఎట్లా దాడి చేస్తారో తెలీదు కదా అని ప్రశ్నిస్తుంటారు. అయితే.. దొంగచాటుగా దెబ్బ తీసే మానవబాంబుల కంటే కూడా.. మన చుట్టూ ఉంటూ.. మన కళ్ల ముందు తిరుగుతూ ఉండే మామూలు వ్యక్తులు కూడా మానవబాంబులా? అంటే షాకింగ్ గా అనిపిస్తుంది కానీ.. ఢిల్లీ కోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తే సమంజసంగా అనిపించకమానదు. చుట్టూ తిరిగే సాదాసీదా ప్రజానీకం మానవ బాంబులన్న వ్యాఖ్యను ఢిల్లీ కోర్టు ఎందుకు చేసిందన్న విషయంలోకి వెళితే..

బాదర్పూర్ ప్రాంతానికి చెందిన జోగి వర్గిస్ అనే వ్యక్తి పూటుగా తాగి కారు నడిపి పోలీసులకు దొరికిపోయాడు. అతనికి కిందిస్థాయి కోర్టు ఆరు రోజుల జైలుశిక్షను రూ.2వేల జరిమానాను విధించింది. తనకు విధించిన శిక్షపై సవాలు చేసిన వర్గిస్.. ఢిల్లీ సెషన్స్ కోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. వర్గిస్ పిటీషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ సెషన్స్ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తాగి డ్రైవింగ్ చేసే వారు సమాజానికి డేంజర్ గా అభివర్ణించిన కోర్టు.. అలాంటి వారు కళ్ల ముందు కనిపించే మానవబాంబులుగా అభివర్ణించింది.

ఈ కేసు సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. తన ఉద్దేశంలో మితిమీరన మద్యం సేవించి.. ద్విచక్రవాహనాలు.. కార్లు నడిపే వారు సూసైడ్ హ్యుమన్ బాంబర్స్ గా పేర్కొన్నారు. తమ తప్పు ఏమీ లేకుండా.. ఇష్టారాజ్యంగా మద్యం సేవించి.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన పాపానికి ప్రాణాలు కోల్పోయిన బాధితుల్ని చూసినప్పుడు.. ఢిల్లీ సెషన్స్ కోర్టు చేసిన వ్యాఖ్యలు సమంజసమనిపించక మానదు.