Begin typing your search above and press return to search.

అప్ కి విజయం అందించిన బిర్యానీ..అసలు విషయం ఇదే!

By:  Tupaki Desk   |   11 Feb 2020 11:30 AM GMT
అప్ కి విజయం అందించిన బిర్యానీ..అసలు విషయం ఇదే!
X
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ హాట్రిక్ విజయాన్ని అందుకుంది. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ - బీజేపీ వంటి జాతీయ పార్టీలను చీపురుతో ఊడ్చేసి.. ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకుంది. సీఎం కేజ్రీవాల్ సంక్షేమ పథకాల ముందు బీజేపీ - కాంగ్రెస్ జాతీయ వరాలు పనిచేయలేదు. ఈ సంచలన విజయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఈ విజయంలో మసాలా దినుసులతో ఘుమ ఘుమలాడే బిర్యానీ కూడా తనవంతు పాత్రను నిర్వహించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘బిర్యానీ’ ఓ రాజకీయ ఆయుధంగా మారింది అని చెప్పాలి.

సీఏఏ - ఎన్‌ ఆర్‌ సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌ బాద్‌ లో ఆందోళన చేస్తున్న వారికి ఆప్‌ ప్రభుత్వం బిర్యానీ సరఫరా చేస్తోందని బీజేపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఐటీ విభాగం హెడ్‌ అమిత్‌ మాలవియా అయితే షహీన్‌ బాద్‌లో బిర్యానీ పంచుతున్నారనడానికి ఇదే బలమైన సాక్ష్యం అంటూ కొన్ని ఫోటోలని కూడా షేర్ చేసారు.

అయితే , ఇలా బిర్యానీని ప్రతికూల ప్రచారానికి ఉపయోగించుకోవడం ఇదే మొదటి సారి కాదు. 2015లో ముంబై టెర్రరిస్టు దాడుల కేసు విచారణ సందర్భంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉజ్వల్‌ నికమ్‌ బిర్యానీ ఆయుధంగా ఉపయోగించారు. జైల్లో టెర్రరిస్ట్‌ అజ్మల్‌ కసబ్‌ కు జైలు అధికారులు బిర్యానీ పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అప్పట్లో కసబ్‌ కు పెరుగుతున్న మద్దతును దెబ్బతీయడానికే తాను ఆ అబద్ధపు ఆరోపణ చేశానని ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా మరోసారి బిర్యానీ వ్యూహం తో ముందుకొచ్చిన బీజేపీ కి ఢిల్లీ వాసులు బుద్దిచెప్పారు. ముస్లింలకు బహు పసందైన బిర్యానీని రాజకీయ ఆయుధంగా వాడినట్లయితే హిందువుల ఓట్లన్నీ కట్టకట్టుకొని తమకే పడతాయని బీజేపీ నేతలు ఆశించారు. కానీ , ఆ పప్పులు ఏమి ఉడకలేదు.