Begin typing your search above and press return to search.

ఢిల్లీ ప్రభుత్వానికి ఇదేం పోయే కాలం..సిక్కిం మనది కాదా?

By:  Tupaki Desk   |   24 May 2020 4:50 AM GMT
ఢిల్లీ ప్రభుత్వానికి ఇదేం పోయే కాలం..సిక్కిం మనది కాదా?
X
వ్యక్తులు.. కొన్ని ప్రైవేటు సంస్థలు.. కార్పొరేట్ కంపెనీలు తప్పు చేయటాన్ని కూడా క్షమించలేని విషయంలో.. ఏకంగా ప్రభుత్వమే చేసిన చెత్త పని షాకింగ్ గా మారింది. ఢిల్లీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన తీవ్ర దుమారాన్ని రేపటమే కాదు.. కేజ్రీ సర్కారుకు ఇదేం పోయే కాలమని తిట్టిపోస్తున్నారు. ఢిల్లీ రాష్ట్ర సర్కారును ఇరుకున పడేయటమే కాదు.. ముఖ్యమంత్రి యుద్ద ప్రాతిపదికన స్పందించిన ఆ ఉదంతంలోకి వెళితే..

సివిల్ డిఫెన్స్ కార్పొరేషన్ లో వాలంటీర్లుగా చేరాలనుకునే వారు అప్లికేషన్లు పెట్టుకోవచ్చంటూ ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటనలో భూటాన్.. నేపాల్ దేశాల సరసన.. సిక్కిం వాసుల్ని జోడించటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో అంతర్భాగమైన సిక్కింను మరో దేశంలా చూపిస్తూ చేసిన ప్రకటనపై పలువురు మండిపడుతున్నారు.

తమను వేరే దేశంగా చూపిస్తూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనపై సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయటమే కాదు.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సమాచారం ఇచ్చారు.ఢిల్లీ ప్రభుత్వ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

1975 మే16న భారత్ లో 22వ రాష్ట్రంగా ఏర్పడిన సిక్కిం.. వారం క్రితమే రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకున్నదని.. ఇలాంటి ప్రకటనలు తాము భారతీయులమని గర్వంగా చెప్పుకునే సిక్కిం ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తాయని ఆ రాష్ట్ర సీఎం ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ రచ్చను గుర్తించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రియాక్ట్ అయ్యారు.

కొందరి పొరపాటు కారణంగా ఇలాంటి తప్పు జరిగిందని.. ఆ ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ దారుణమైన తప్పునకు బాధ్యుడ్ని చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ విభాగంలోని అధికారికి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏమైనా దేశంలోని ఒక రాష్ట్రాన్ని వేరే దేశాల జాబితాలో నిలపటానికి మించిన దారుణమైన తప్పు మరొకటి ఉండదని చెప్పక తప్పదు.