Begin typing your search above and press return to search.

కేంద్రంతో ఢిల్లీ సర్కార్ ఫైట్.. సుప్రీంకోర్టులో ‘పంచాయితీ’

By:  Tupaki Desk   |   28 April 2022 3:30 PM GMT
కేంద్రంతో ఢిల్లీ సర్కార్ ఫైట్.. సుప్రీంకోర్టులో ‘పంచాయితీ’
X
ఢిల్లీలో అధికారుల బదిలీ పోస్టింగ్ ల అంశంపై కేంద్రంతో ఫైట్ కు రెడీ అయ్యింది ఢిల్లీ సర్కార్. ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో పంచాయితీకి పెట్టింది. ఈ వ్యవహారాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మసనం విచారిస్తోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. అధికారులపై పూర్తి నియంత్రణ ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.

2019 ఫిబ్రవరి 14న సుప్రీంకోర్టు ఈ అంశంపై తీర్పు వెలువరించింది. సర్వీస్ లపై నియంత్రణ విషయంలో బెంచ్ లోని ఇద్దరు న్యాయమూర్తులు మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఢిల్లీలో పనిచేసే అధికారులపై ఢిల్లీ ప్రభుత్వమే నియంత్రించాలని జస్టిస్ సిక్రీ విశ్వసించారు. కానీ దీన్ని తోటి జడ్జి అశోక్ భూషణ్ వ్యతిరేకించారు. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం అని.. కేంద్రం నుంచి పంపిన అధికారులపై లెఫ్ట్ నెంట్ గవర్నర్ దే నియంత్రణ అని అన్నారు. దీంతో ఈ అంశాన్ని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేశారు.

ఈ కీలక అంశాన్ని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లీ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుతం పరిస్థితి మారిందని కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఈ అంశం కూడా గత సంవత్సరం ఢిల్లీలోని ఎన్.సీటీ చట్టంలో చేసిన సవరణకు సంబంధించినందని వాదించారు.

ఇక ఢిల్లీ ప్రభుత్వ తరుఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ వాదనను వ్యతిరేకించారు. కేంద్రం కావాలనే పొడిగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీంతో ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి పంపుతూ త్రిసభ్య ధర్మాసనం ఈరోజు తీర్పు రిజర్వ్ చేసింది.

ఈ వ్యవహారాన్ని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేసినా మే 15లోపు విచారణ పూర్తి చేసి తీర్పును వెలువరించేందేందుకు సుప్రీంకోర్టు డిసైడ్ అయ్యింది.

ఢిల్లీ స్వయం ప్రతిపత్తి రాష్ట్రం కాదు. అక్కడ పోలీస్, రక్షణ వ్యవహారాలన్నీ కేంద్రం చేతుల్లోనే ఉంటాయి. సగం రాష్ట్రం, సగం కేంద్రం చేతుల్లో పాలన ఉంటుంది. ఈక్రమంలోనే లెఫ్ట్ నెంట్ గవర్నర్ దే అక్కడ నిర్ణయాధికారం. దీంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చాలాసార్లు గరవ్నర్ కు వ్యతిరేకంగా గళమెత్తారు. ఆయన నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. తన పాలనలో తనకు నచ్చినవాళ్లే ఉండాలని కోర్టుకు కూడా ఎక్కాడు. ఆ విచారణే తాజాగా తుదిదశకు వచ్చింది.