Begin typing your search above and press return to search.

ఢిల్లీ అల్లర్లకు ఆ నలుగురు బీజేపీ ఎంపీలే కారణమా?

By:  Tupaki Desk   |   26 Feb 2020 3:44 PM GMT
ఢిల్లీ అల్లర్లకు ఆ నలుగురు బీజేపీ ఎంపీలే కారణమా?
X
ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఓ వైపు ట్రంప్ పర్యటన జరుగుతున్న సమయంలోనే సీఏఏ అనుకూల - వ్యతిరేక వర్గాల మధ్య హింస చెలరేగింది. ఈ ఆందోళనల్లో రాళ్లు రువ్వడంతో హెడ్ కానిస్టేబుల్ మరణించాడు. తాజాగా ఓ ఐబీ అధికారి కూడా మరణించినట్లు తేలింది. దీంతో, ఈ ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 23కు చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న హింసాకాండకు బీజేపీ నేతలే కారణమని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వారు చేసిన విద్వేష ప్రసంగాల వల్లే ఢిల్లీలో హింస తీవ్రస్థాయికి చెలరేగిందని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ నలుగురు బీజేపీ నేతలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై వెంటనే ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

బీజేపీ నేతలు కపిల్ మిశ్రా - అనురాగ్ ఠాకూర్ - అభయ్ వర్మ - పర్వేష్ వర్మలపై ఎఫ్ ఐఆర్ నమోదు కానుంది. ఢిల్లీలో వీరు చేసిన ప్రసంగాలకు సంబంధించిన వీడియోలను ఢిల్లీ హైకోర్టు పరిశీలించింది. వారిపై వెంటనే ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాల్పుల్లో ధ్వంసమైన ఆస్తి నష్టాలకు సంబంధించి ఎఫ్ ఐఆర్‌ లను నమోదు చేయడంలో అసమానతను చూపించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేయలేదని ప్రశ్నించింది. కాగా, సీఏఏ వ్యతిరేక నిరసన సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగం చేశారన్న కారణంగా ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 22న మొరాదాబాద్‌ లోని ఈద్గా మైదాన్‌ లో జరిగిన సీఏఏ వ్యతిరేక నిరసన సమావేశంలో ఖురేషి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ఐపీసీలోని 143 - 145 - 149 - 188 కింద గల్షాహీద్ పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదైంది.