Begin typing your search above and press return to search.

20 మంది ఆప్ ఎమ్మెల్యేల‌పై వేటు త‌ప్పింది

By:  Tupaki Desk   |   23 March 2018 11:29 AM GMT
20 మంది ఆప్ ఎమ్మెల్యేల‌పై వేటు త‌ప్పింది
X
లాభదాయక పదవుల్లో కొన‌సాగుతుండ‌టం వ‌ల్ల‌ అనర్హత వేటుకు గురైన ఎపిసోడ్ మ‌రో మ‌లుపు తిరిగింది. ఎమ్మెల్యేలు లాభదాయకమైన పదవుల్లో ఉండరాదు అన్న నిబంధన ఆధారంగా ఆప్ ఎమ్మెల్యేలపై ఎన్నికల సంఘం ఇటీవల అనర్హత వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. లాభదాయకమైన పదవులు కొనసాగుతున్న 20 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇటీవల ఎన్నికల సంఘం రాష్ట్రపతికి సిఫారసు చేసింది. ఆ ప్రతిపాదన మేరకు రాష్ట్రపతి కూడా వేటు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై కోర్టును ఆశ్ర‌యించ‌గా తాజా పెద్ద రిలీఫ్ ద‌క్కింది.

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. ఆప్ ఎమ్మెల్యేలపై విధించిన అనర్హత వేటును ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది. ప్రతి ఒక కేసును నిశితంగా పరిశీలించి, ఆ తదుపరి నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పును ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్వాగతించారు. సత్యం గెలిచిందన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులను అక్రమ పద్ధతిలో అనర్హతకు గురి చేశారన్నారు. ఢిల్లీ ప్రజలకు హైకోర్టు న్యాయాన్ని ప్రసాదించిందన్నారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో 67 సీట్లు ఆప్ పార్టీ ఖాతాలో ఉన్నాయి.

ఇదిలాఉండ‌గా...20మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం వల్ల ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేకపోయినా, ఆ పార్టీకి మాత్రం ఇది కోలుకోలేని దెబ్బ అని అంచ‌నాలు వెలువ‌డ్డాయి. 70 సీట్లు కలిగిన ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ బలం ఈ వేటుతో 67 నుంచి 47కు పడిపోయింది. ప్రభుత్వ మనుగడకు 36మంది ఎమ్మెల్యేల మద్దతు సరిపోతుంది కాబట్టి ఆప్ ప్రభుత్వం కొనసాగుతుందని వివ‌రించారు. ఈ తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ ముందు రెండు ప్రత్యామ్నాయాలు వ‌చ్చాయి. ఒకటి ఉప ఎన్నికలకు వెళ్లడం కాగా, రెండోది ఈసీ నిర్ణయంపై స్టే కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం. ఇప్పటికే పలు వివాదాలతో రాజకీయ ప్రాబల్యం క్రమంగా సన్నగిల్లుతున్న నేపథ్యంలో ఉపఎన్నికలకు ఆప్ సిద్ధంగా లేదు. ప్రభుత్వ పనితీరుపై కూడా ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. గత ఏడాది మార్చిలో జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆగస్టులో జరిగిన ఉపఎన్నికల్లో బవానా అసెంబ్లీ స్థానాన్ని తిరిగి గెలుచుకోవడం ద్వారా ఆ పార్టీ తన బలాన్ని కొంత పెంచు కోగలిగింది. ఈ నేపథ్యంలో ఉపఎన్నికలకు వెళ్ల డం కన్నా, ఈసీ నిర్ణయంపై న్యాయపోరాటానికి దిగేందుకే కేజ్రీవాల్ మొగ్గుచూపుతున్నట్లు వార్త‌లు వ‌చ్చాయి. దానికి త‌గిన‌ట్లుగానే కోర్టు నుంచి సానుకూల తీర్పు వ‌చ్చింది.