Begin typing your search above and press return to search.

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం.. శ‌ర‌త్‌చంద్రారెడ్డి, బినోయ్‌ల‌కు రిమాండ్‌

By:  Tupaki Desk   |   22 Nov 2022 4:11 AM GMT
ఢిల్లీ లిక్క‌ర్ స్కాం.. శ‌ర‌త్‌చంద్రారెడ్డి, బినోయ్‌ల‌కు రిమాండ్‌
X
దేశ రాజ‌ధాని స‌హా రెండు తెలుగు రాష్ట్రాల‌ను కుదిపేసి, రాజ‌కీయంగా అనేక విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌కు దారితీసిన ఢిల్లీ లిక్క‌ర్ కుంభకోణం కేసులో అరబిందో గ్రూప్ డైరెక్టర్ పెనక శరత్ చంద్రారెడ్డి, పెర్నాడో రికార్డ్ కంపెనీ ప్రతినిధి బినోయ్ బాబులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుల బెయిల్ పిటిషన్లను ఇదే కేసులో నిందితులుగా ఉన్న బోయినపల్లి అభిషేక్, విజయ్ నాయర్ల పిటిషన్లతో కలిపి ఈ నెల 24న విచారించనున్నట్లు ప్రత్యేక జడ్జి ప్రకటించారు. కోర్టు ప్రాంగణంలో శరత్ చంద్రారెడ్డిని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పరామర్శించారు.

లిక్క‌ర్ కుంభకోణంలో మనీలాండరింగ్ చట్టం కింద శరత్, బినోయ్ బాబులను ఈ నెల 10న ఈడీ ఢిల్లీలో అరెస్టు చేసింది. విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేసినట్లు ప్రత్యేక న్యాయస్థానానికి తెలియజేసి కస్టడీకి తీసుకుంది. తొలుత ఏడు రోజులు, తర్వాత మరో నాలుగు రోజులు కస్టడీకి తీసుకున్న ఈడీ.. అది ముగియడంతో శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులను న్యాయస్థానంలో హాజరుపరిచింది.

దర్యాప్తు కొనసాగుతోందని, మిగిలిన వారిని ప్రశ్నిస్తున్నట్లు తెలిపింది. నిందితులను ఇప్పుడే విడుదల చేయకుండా జ్యుడీషియల్ రిమాండ్కు పంపాలన్న ఈడీ విజ్ఞప్తిని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అంగీకరించారు.

విన్న‌పాలు విన‌లేదు!కాగా, త‌మ‌ను రిమాండ్‌కు త‌ర‌లించ‌డంపై ఇద్ద‌రు నిందితులు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అదేస‌మ‌యంలో అనారోగ్యం కారణంగా ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని నిందితుల తరఫు న్యాయవాదులు ప్రత్యేక న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కేసుల్లో ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించలేమని ప్రత్యేక జడ్జి తెలుపగా.. శరత్ చంద్రారెడ్డి తీవ్రమైన వెన్నునొప్పి, బీపీతో బాధపడుతున్నారని తెలిపారు. జైలులో ఉన్ని దుస్తులు, ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

బినోయ్ బాబుకు తీవ్రమైన అజీర్తి సమస్య ఉందని, ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని కోరారు. చిగుళ్ల సమస్య వల్ల నీటిని ఉంచుకునేందుకు ప్రత్యేక ఫ్లాస్క్, ప్రత్యేక పడకకు అనుమతి ఇవ్వాలని న్యాయవాదులు కోరారు.

నిందితులు ఇరువురికి ఇంటి భోజనం, రెండు జతల ఉన్ని దుస్తులు, జైలు నిబంధనల ప్రకారం వినియోగించుకోవడానికి పాదరక్షలు తెచ్చుకునేందుకు ప్రత్యేక జడ్జి అవకాశం కల్పించారు. ప్రత్యేక పడకను ఏర్పాటుకు చేసుకోవడం సాధ్యపడదని తేల్చి చెప్పారు. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే జైలు ఆసుపత్రిలో చూపించాలన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.