Begin typing your search above and press return to search.

అమెజాన్‌ కు రూ.50ల‌క్ష‌లు చిల్లేసి దొరికేశాడు

By:  Tupaki Desk   |   11 Oct 2017 6:55 AM GMT
అమెజాన్‌ కు రూ.50ల‌క్ష‌లు చిల్లేసి దొరికేశాడు
X
అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రించిన ఒక కుర్రాడు అడ్డంగా బుక్ అయ్యాడు. ఆన్ లైన్ వ్యాపార దిగ్గ‌జ‌నం అమెజాన్‌కు రూ.50ల‌క్ష‌ల‌కు చిల్లేసిన అత‌గాడు చేసిన ప‌ని వింటే షాక్ తినాల్సిందే. హోట‌ల్ మేనేజ్ మెంట్ కోర్సు పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్న 21 ఏళ్ల శివ‌మ్ చోప్రా అనే కుర్రాడి లీల‌లు వింటే అవాక్కు అవ్వాల్సిందే.

ఆన్ లైన్ మోసాన్ని ఆశ్ర‌యించి.. అమోజాన్ లాంటి దిగ్గ‌జ సంస్థ‌కే రూ.50ల‌క్ష‌లు చిల్లేసిన అత‌గాడు తాజాగా దొరికిపోయాడు. ఇత‌గాడ్ని ప‌ట్టుకునేందుకు నెల‌ల కొద్దీ ప్ర‌య‌త్నిస్తున్న ఢిల్లీ పోలీసుల క‌ష్టం ప‌లించింద‌నే చెప్పాలి. ఇంత‌కీ.. అమోజాన్‌ కు అంత భారీగా ఎలా చిల్లేశాడు? ఇంత‌కీ ఏం చేశాడు? అన్న విష‌యాల్లోకి వెళితే..

ఢిల్లీకి చెందిన శివ‌మ్‌ చోప్రా ఉద్యోగం లేని కుర్రాడు. తేలిగ్గా డ‌బ్బు సంపాదించాల‌న్న ఆలోచ‌న‌తో.. ఆన్ లైన్ దిగ్గ‌జ సంస్థ అమోజాన్ ను బురిడీ కొట్టే ప్లాన్ సిద్ధం చేశాడు. తొలిద‌ఫాలో రెండు ఫోన్ల‌కు ఆర్డ‌ర్ ఇచ్చి.. వాటిని తీసుకున్న వెంట‌నే.. తాను బాక్స్ ఓపెన్ చేస్తే అందులో ఫోన్ లేద‌ని పేర్కొంటూ కంపెనీ నుంచి రిఫండ్ పొందాడు.

ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తే భారీగా డ‌బ్బు సంపాదించొచ్చ‌న్న ఆశ‌తో ఈ మోసాన్ని ఒక వ్యాపారంగా మార్చేశాడు. ఖ‌రీదైన ఆపిల్‌.. శాంసంగ్‌.. వ‌న్ ప్ల‌స్ లాంటి పోన్లను ఆర్డ‌ర్ చేసేవాడు. ఇందుకోసం పెద్ద ఎత్తున సిమ్ లు కొనుగోలు చేశాడు. త‌ప్పుడు అడ్ర‌స్ ల‌తో ఉన్న సిమ్ కార్డుల‌ను తెలిసిన షాపులో తీసుకున్న అత‌గాడు.. ఆ ఫోన్ నెంబ‌రుతో ఆర్డ‌ర్ ఇచ్చేవాడు. అడ్ర‌స్ స‌రిగా ఇవ్వ‌ని నేప‌థ్యంలో అమోజాన్ డెలివ‌రీ బాయ్ ఆర్డ‌ర్ లో పేర్కొన్న ఫోన్‌కి కాల్ చేసేవారు.

దీంతో తాను ద‌గ్గ‌ర్లోనే ఉన్నాన‌ని చెబుతూ..తాను పెట్టిన ఆర్డ‌ర్ తీసుకునేవాడు. ఆ త‌ర్వాత తన‌కు వ‌చ్చిన ఆర్డ‌ర్లో వ‌స్తువులు లేవ‌ని చెబుతూ రిఫండ్ కోసం క్లయిమ్ చేసేవాడు. త‌న దందా ఎలాంటి అనుమానాలు రాకుండా సాగుతున్న నేప‌థ్యంలో మ‌రింత ముమ్మ‌రం చేశాడు.

ప్ర‌తిసారీ వేర్వేరు నెంబ‌రుతో.. వేర్వేరు లొకేష‌న్ల మీద ఆర్డ‌ర్ బుక్ చేసి.. త‌ర్వాత త‌న‌కొచ్చిన పార్శిల్ ఖాళీగా ఉందంటూ ఫిర్యాదు చేసి డ‌బ్బులు వాప‌సు పొందేవాడు. ఇలా ఇప్ప‌టికి 166 ఫోన్లు ఆర్డ‌ర్ చేసి.. రూ.50ల‌క్ష‌ల మేర అమెజాన్‌ కు చిల్లేశాడు. ఇత‌గాడి వ్య‌వ‌హారంపై సందేహం వ‌చ్చిన అమెజాన్ ప్ర‌త్యేకంగా దృష్టి సారించింది. పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన ఢిల్లీ పోలీసులు తాజాగా శివ‌మ్ చోప్రాను అదుపులోకి తీసుకున్నారు. అత‌డి ఖాతాలో ఉన్న రూ.10ల‌క్షల మొత్తాన్ని సీజ్ చేశారు. ఎంత తెలివిగా బోల్తా కొట్టిద్దామ‌నుకున్నా.. పాపం పండ‌నంత వ‌ర‌కే ఆట‌లు సాగుతాయి. ఒక్క‌సారి తేడా వ‌స్తే..ఇక అంతే సంగ‌తులు.