Begin typing your search above and press return to search.
విన్నారా... దేశరాజధాని క్రైమ్ రికార్డ్స్!
By: Tupaki Desk | 5 Sep 2016 4:45 AM GMTదేశరాజధాని ఢిల్లీ క్రైమ్ రికార్డ్స్ నెలకొల్పుతుంది. ఈ విషయం మోడీ, కేజ్రీలకు తెలియంది కాకపోయినా.. తాజాగా విడుదలయిన నివేదికలో అత్యంతదారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నివేదిక ప్రకారం దేశరాజధాని ఢిల్లీ ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందో అర్ధం అవుతుంది. ఆ ప్రాంతంలో జనాభా ఎక్కువగా ఉండటమే దీనికి కారణమా.. లేక పోలీసు వ్యవస్థ బలంగా లేకపోవడమే కారణమా అనేది తెలియాల్సిన విషయం. ఇప్పటికే ట్రాఫిక్ విషయంలోనూ, వర్షం వడితే కాల్వలుగా మారుతున్న రోడ్ల విషయంలోనూ చెడ్డపేరు మూటగట్టుకుంటున్న ఢిల్లీ.. క్రైమ్ విషయంలో కూడా రికార్డులు సృష్టిస్తుంది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సీఆర్ బీ) విడుదల చేసిన తాజా నివేదికలో దేశ రాజధాని ఢిల్లీ మహిళలకే కాదు సీనియర్ సిటిజెన్లకు కూడా సురక్షితం కాదని తెలిసింది! నిర్భయ సంఘటన అనంతరం ఢిల్లీని మహిళలకు రక్ష్ణలేని నగరంగా భావిస్తున్న తరుణంలో.. దేశంలో సీనియర్ సిటిజెన్లకు సురక్షితంకాని నగరాల్లో కూడా ఢిల్లీ మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. వరుసగా రెండో ఏడాది కూడా ఢిల్లీ అత్యంత సురక్షితంకాని నగరంగా నిలవడం గమనార్హం.
ఈ నివేదిక ప్రకారం .. దేశంలో ఇతర నగరాలతో పోలిస్తే ఢిల్లీలోని సీనియర్ సిటిజెన్లపై జరిగే నేరాలు సుమారు ఐదురెట్లు అధికంగా ఉన్నాయట. గతేడాది ఢిల్లీలో సీనియర్ సిటిజెన్లపై జరిగిన నేరాల్లో 145 దొంగతనం కేసులు - 123 ఛీటింగ్ కేసులు - 14 హత్య కేసులు - 2 హత్యాయత్నం కేసులు - ఒక అత్యాచారం కేసులతో కలిపి మొత్తం 1248 కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన చూసుకుంటే.. ప్రతి లక్షమందిలో 108.8 మందిపై నేరాలు జరుగుతున్నాయి. ఇక 2014తో పోలిస్తే గతేడాది 2015లో ఈ నేరాలు 19 శాతం పెరిగాయి. కాగా ఈ విషయాలపై స్పందించిన పోలీసు అదికారులు.. సీనియర్ సిటిజెన్ల కోసం 1291 హెల్ప్ లైన్ నెంబర్ ఉందని, ఏ సమయంలోనైనా తమకు ఫోన్ చేయవచ్చని చెబుతున్నారు.