Begin typing your search above and press return to search.

దిశ చట్టం పై ఢిల్లీ, ఒడిశా ప్రశంసలు ..త్వరలోనే అక్కడ కూడా ?

By:  Tupaki Desk   |   17 Dec 2019 6:16 AM GMT
దిశ చట్టం పై ఢిల్లీ, ఒడిశా ప్రశంసలు ..త్వరలోనే అక్కడ కూడా ?
X
ఏపీలో ఏడవ రోజు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సమావేశాలు ప్రారంభించిన సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ‘దిశ’ చట్టం అమలు పై సభను అభినందించారు. ఏపీ ప్రభుత్వం ఆమోదించిన దిశ చట్టంపై అందరూ చట్టాన్ని ప్రశంసిస్తున్నారని స్పీకర్ చెప్పారు. దిశ చట్టం ప్రతులను పంపమని ఒడిశా ప్రభుత్వం కోరినట్లు స్పీకర్ తెలిపారు. దిశ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేస్తామని ఒడిశా ప్రభుత్వం చెప్పింది అని స్పీకర్ సభలో తెలిపారు.

మరోవైపు దిశ చట్టం ప్రతుల కోసం ఢిల్లీ ప్రభుత్వం కూడా ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దిశ చట్టాన్ని ఆమోదించినందుకు గర్వంగా ఉందని సీతారాం తెలిపారు. మహిళలను దారుణమైన నేరాల నుండి రక్షించడానికి ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

దిశ బిల్లుకు శుక్రవారం ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం నేరానికి సంబంధించి పక్కా ఆధారాలు ఉంటే.. అత్యాచార కేసుల దర్యాప్తును వారం రోజుల్లో పూర్తి చేయడంతోపాటు.. 14 రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేస్తారు. ఇక 21 రోజుల్లోనే శిక్షలు ఖరారవుతాయి. మొన్నటి వరకు ఈ కేసుల విచారణకు 4 నెలల సమయం పడుతుండగా.. ఇక నుంచి మూడు వారాల్లోనే తీర్పు వెలువడుతుంది. అలాగే మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం జిల్లాకో కోర్టు చొప్పున ఏర్పాటు చేయనున్నారు.ఇకపోతే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటితో ముగియబోతున్నాయి.