Begin typing your search above and press return to search.
రాష్ట్రపతి భవన్ లో సీనియర్ అధికారికి వైరస్ .. క్వారంటైన్ లో ఉద్యోగులు !
By: Tupaki Desk | 18 May 2020 7:10 AM GMTమహమ్మారి కేసుల సంఖ్య దేశంలో రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా పాజిటివ్ కేసులు మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అలాగే ఈ మద్యే విఐపి ప్రాంతాలలో కూడా వైరస్ కేసులు నమోదు అవుతుండటంతో ఆందోళన ఎక్కువవుతుంది. తాజాగా రాష్ట్రపతి భవన్‌లో సీనియర్ పోలీస్ అధికారికి మహమ్మారి పాజిటివ్ అని తేలడంతో వెంటనే ఆయనను ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అని ప్రాస మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. దీనితో రాష్ట్రపతి భవన్ లో పనిచేస్తున్న అనేక మంది పోలీసులు, ఇతర సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంచినట్లు అధికారిక వర్గాల సమాచారం.
కాగా, గత నెలలో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ కావడంతో దాదాపు 115 కుటుంబాలను ఐసోలేషన్ లో ఉంచిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఇతర అనారోగ్య సమస్యలు ఉండటంతో ఏప్రిల్ 13న ఢిల్లీలోని బిఎల్ కపూర్ ఆసుపత్రిలో కన్నుమూసినట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఆయన కుటుంబసభ్యుల్లో ఒకరికి పాజిటివ్ రాగా, మిగిలిన ఆరుగురికి నెగిటివ్ అని తేలింది. కాగా , అప్పుడు రాష్ట్ర పతి భవన్ లో ఎవరికీ కూడా వైరస్ సోకలేదు అని ప్రకటించారు.
ఇకపోతే, వైరస్ పై పోరుకు తనవంతు సాయంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇప్పటికే తన నెల జీతాన్ని విరాళంగా అందజేయగా, తాజాగా తన జీతంలో 30 శాతం డబ్బును ఏడాదిపాటు పీఎం కేర్స్ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కరోనా సంక్షోభంలో రాష్ట్రపతి భవన్ లో ఖర్చులను తగ్గించడానికి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే ఇకపై రాష్ట్రపతి భవన్ పరిధిలో నిర్వహించే ఏ ఫంక్షన్ కి అయినా కూడా పరిమిత సంఖ్యలో ఖర్చు చేయాలని నిర్ణయయించారు.