Begin typing your search above and press return to search.

సీబీఐకి డైరెక్ట‌ర్ దొరికేశారు!

By:  Tupaki Desk   |   20 Jan 2017 4:34 AM GMT
సీబీఐకి డైరెక్ట‌ర్ దొరికేశారు!
X
సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్‌... షార్ట్‌క‌ట్‌లో సీబీఐగా మ‌నం పిలుచుకుంటున్న‌ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థకు ఎట్ట‌కేల‌కు రెగ్యుల‌ర్ డైరెక్ట‌ర్ నియ‌మితుల‌య్యారు. 1979 ఐపీఎస్ బ్యాచ్‌ కు చెందిన సీనియ‌ర్ పోలీస్ అధికారి అలోక్ కుమార్ వ‌ర్మ‌ను సీబీఐ డైరెక్ట‌ర్‌ గా నియ‌మిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిన్న కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సీబీఐ డైరెక్ట‌ర్‌ గా ప‌నిచేస్తున్న అనిల్ సిన్హా ప‌ద‌వీ కాలం ముగిసిన త‌ర్వాత ఆ పోస్టును భ‌ర్తీ చేసే విష‌యంపై కేంద్రం అంత‌గా దృష్టి సారించ‌లేద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో ఆ సంస్థ‌లో డైరెక్ట‌ర్ త‌ర్వాత పోస్టులో కొన‌సాగుతున్న రాకేశ్ ఆస్తానాను కేంద్రం తాత్కాలిక డైరెక్ట‌ర్‌ గా నియ‌మించేసి చేతులు దులుపుకుంది. అయితే దేశంలో కీల‌క కేసుల‌న్నింటి దర్యాప్తు బాధ్య‌త‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న సీబీఐకి రెగ్యుల‌ర్ డైరెక్ట‌ర్ లేక‌పోతే ఎలాగంటూ... స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు మొట్టికాయ‌లేసిన త‌ర్వాత గాని కేంద్రం మేల్కోలేద‌నే చెప్పాలి.

ఇటీవ‌ల జ‌రిగిన విచార‌ణ సంద‌ర్భంగా ఈ నెల 20లోగా సీబీఐకి రెగ్యుల‌ర్ డైరెక్ట‌ర్‌ ను నియ‌మించి తీర‌తామ‌ని కేంద్రం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ క్ర‌మంలో గ‌డువు ముగియ‌డానికి ఓ రోజు ముందుగా అలోక్ కుమార్ వ‌ర్మ‌ను సీబీఐ డైరెక్ట‌ర్‌గా నియ‌మిస్తూ కేంద్రం నిన్న ఉత్త‌ర్వులు జారీ చేసింది. అత్యున్న‌త ద‌ర్యాప్తు సంస్థ‌కు చీఫ్‌ను నియ‌మించే క‌మిటీకి ప్రధాని నేతృత్వం వ‌హిస్తుండ‌గా, క‌మిటీలో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, లోక్‌ స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత కూడా స‌భ్యులుగా ఉంటారు. కీల‌క కేసుల ద‌ర్యాప్తు బాధ్య‌త‌లు భుజానికెత్తుకున్న సీబీఐకి చీఫ్‌ను ఎంపిక చేసే ఈ క‌మిటీకి ఎన‌లేని ప్రాధాన్యమే ఉంద‌ని చెప్పాలి. క‌మిటీలో ఏ ఒక్క‌రు కాద‌న్నా... కూడా నియామ‌కం దాదాపుగా ఆగిపోవ‌డం ఖాయ‌మే.

సుప్రీంకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో ఆఘ‌మేఘాల‌పై క‌దిలిన కేంద్రం... అలోక్ కుమార్ వ‌ర్మ‌ను ఆ ప‌దివికి ఎంపిక చేసింది. వ‌ర్మ ఎంపిక‌కు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఉన్న జ‌స్టిస్ ఖేహార్‌, లోక్‌ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గేలు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో నిన్న సీబీఐకి రెగ్యుల‌ర్ డైరెక్టర్ పోస్టు భ‌ర్తీ అయిన‌ట్లైంది. ఇక అలోక్ కుమార్ వ‌ర్మ కెరీర్ విష‌యానికి వ‌స్తే... 1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయ‌న అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ - గోవా - మిజోరాం - ప‌లు కేంద్ర పాలిత ప్రాంతాల్లో వివిధ కేడ‌ర్ల‌లో ప‌నిచేశారు. ప్ర‌స్తుతం 59 ఏళ్ల వ‌య‌సున్న వ‌ర్మ‌... రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్ట‌ర్‌ గా కొన‌సాగుతారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/