Begin typing your search above and press return to search.

ట్విటర్ ఇండియా కార్యాలయంలో ఢిల్లీ పోలీసుల సోదాలు

By:  Tupaki Desk   |   25 May 2021 9:32 AM GMT
ట్విటర్ ఇండియా కార్యాలయంలో ఢిల్లీ పోలీసుల సోదాలు
X
మళ్లీ వార్తల్లోకి వచ్చింది ట్విటర్. నిజానికి ఇవాల్టి రోజున వార్తలకు ప్రధాన సోర్సుగా మారిన ఈ సోషల్ మీడియా దిగ్గజం.. ఇప్పుడు తానే వార్తగా మారిన పరిస్థితి. ఢిల్లీ పోలీసులు ట్విటర్ ఇండియాకు షాకిచ్చారు. ఢిల్లీతో పాటు గుర్గావ్ ప్రాంతాల్లోని ట్విటర్ కార్యాలయానికి వెళ్లిన వారు సోదాలు చేపట్టటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ట్విటర్ ఇండియా ఆఫీసుకు ఢిల్లీ పోలీసులు వెళ్లాల్సిన అవసరం ఏమిటి? వారెందుకు సోదాలు నిర్వహించారు? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి.

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. బీజేపీజాతీయ ప్రతినిధి సంబిత్ పాట్రా అనే నేత ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సారాంశం ఏమంటే.. కరోనా మహ్మమారి ఎపిసోడ్ లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ.. కాంగ్రెస్ పార్టీ టూల్ కిట్ తయారు చేసిందని పేర్కొన్నారు. ఇదే తరహా ట్వీట్ ను బీజేపీ నేతలు కొందరు పోస్టు చేశారు కూడా. సంబిత్ పోస్టు చేసిన ట్వీట్ పై స్పందించిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఛైర్మన్ రోహాన్ గుప్తా ట్విటర్ కు ఒక లేఖ రాశారు.

అందులో నకిలీ టూల్ కిట్ గురించి బీజేపీనేత ట్వీట్ లో పేర్కొన్నారని.. అందులో కాంగ్రెస్ పార్టీకి తప్పుగా ఆపాదించినట్లుగా వెల్లడించారు. ఇదిలా ఉండగా.. బీజేపీ నేత సంబిత్ పోస్టు చేసిన ట్వీట్ కు.. మానిప్యులేటెడ్ మీడియా అన్న లేబుల్ జత చేయటం గమనార్హం. టూల్ కిట్ గురించి ట్విటర్ లో ఏ సమాచారం ఉంది? మ్యానిప్యులేటెడ్ మీడియా లేబుల్ ఎందుకు ఎంచుకున్నారో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు.

వారు ట్విటర్ ఇండియాకు చెందిన రెండు కార్యాలయాలకు వెళ్లి సోదాలు నిర్వహించారు. తొలుత ఈ ఉదంతాన్ని ట్విటర్ కు నోటీసులు ఇవ్వటానికి ఢిల్లీ పోలీసులు వెళ్లినట్లుగా పేర్కొన్నారు. తీరా చూస్తే.. వారు సోదాలు నిర్వహించటం హాట్ టాపిక్ గా మారింది. అయితే.. జరిగింది వేరే అన్న మాట వినిపిస్తోంది. ట్విటర్ కు నోటీసులు ఇద్దామని వెళ్లిన ఢిల్లీ పోలీసులు.. ట్విటర్ ఇండియా ఎండీని కలిశారని.. పోలీసులు వేసిన ప్రశ్నలకు ఆయన అసంపూర్ణంగా సమాధానాలు ఇవ్వటం.. నోటీసులు ఇవ్వటానికి సరైన వ్యక్తి ఎవరన్న విషయాన్ని తెలుసుకోవాలన్నపరిస్థితికి ఢిల్లీ పోలీసులు వచ్చినట్లు చెబుతును్నారు. ఈ క్రమంలోనే.. తాము సోదాలు నిర్వహించినట్లుగా చెబుతున్నారు. అయితే.. ట్విటర్ ఇండియా కార్యాలయంలో సోదాలు నిర్వహించారని వస్తున్న వార్తలపై ఢిల్లీ పోలీసులు మాత్రం నోరు విప్పటం లేదు. దీంతో.. అక్కడేం జరిగిందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.