Begin typing your search above and press return to search.

రీల్ సీన్ ను రియల్ గా చూపించిన ఢిల్లీ పోలీసులు

By:  Tupaki Desk   |   6 Nov 2019 7:32 AM GMT
రీల్ సీన్ ను రియల్ గా చూపించిన ఢిల్లీ పోలీసులు
X
దేశంలో ఎన్నో వ్యవస్థలు ఉన్నా.. పోలీసులు సూపర్ పవర్ గా అభివర్ణిస్తారు. మిగిలిన వారు తమ హక్కుల కోసం.. తమకు జరిగే అన్యాయాల మీద గళం విప్పటం కామన్. కానీ.. పోలీసులు.. సైన్యం మాత్రం అలాంటి వాటికి అతీతం అన్నట్లు వ్యవహరిస్తుంటారు. తమకు కొన్ని విషయాల్లో అన్యాయం జరిగినా.. నష్టం వాటిల్లినా పంటి బిగువునా భరిస్తారే కానీ.. మిగిలిన వారి మాదిరి రోడ్డెక్కని వైనం కనిపిస్తుంది. అయితే.. ఇందుకు భిన్నంగా కొన్ని సినిమాల్లో మాత్రం అసాధారంగా పోలీసులు నిరసన ప్రదర్శించే సీన్లు చూపిస్తారు.

ఇలాంటివి రీల్ కే పరిమితం కానీ రియల్ గా మాత్రం ఉండవన్న మాటకు భిన్నంగా ఢిల్లీ పోలీసులు వ్యవహరించి సంచలనంగా మారారు. తీస్ హజారీ కోర్టుల సముదాయంలో పోలీసులకు.. న్యాయవాదులకు మధ్య జరిగిన ఘర్షణలపై ఢిల్లీ హైకోర్టు తీర్పునకు నిరసనగా ఆందోళన చేపట్టిన ఢిల్లీ పోలీసులు షాకిచ్చారు. ఇప్పటివరకూ ఎప్పుడూ లేని రీతిలో ధిక్కార స్వరాన్ని ప్రదర్శించారు ఢిల్లీ పోలీసులు.

లాయర్ల దాడిని నిరసించటమే కాదు.. అందుకు బాధ్యులైన లాయర్లపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడించటం సంచలనమైంది. శాంతిభద్రతల్ని కాపాడాల్సిన పోలీసులే వేలాదిగా నిరసన కార్యక్రమంలో పాల్గొనటం షాకింగ్ గా మారింది. దాదాపు పదకొండు గంటల పాటు సాగిన ధర్నా హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఇలాంటి పరిణామాన్ని ఇప్పటివరకూ తాము చూడలేదన్న మాట పలువురి నోట వినిపించింది.

నిరసనల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్న ఉన్నతాధికారుల మాటల్ని పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ.. ధర్నా చేస్తున్న ప్రాంతం దద్దరిల్లేలా చేశారు. వేలాదిగా తరలి వచ్చిన పురుష.. మహిళా సిబ్బందితో పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయం కిక్కిరిసిపోయింది.

చివరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ సీన్లోకి వచ్చి ఆందోళన విరమించాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. ఇలాంటి వేళ.. ప్రత్యేక పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా రంగంలోకి దిగారు. తీస్ హజారీ కోర్టు ఆవరణలో జరిగిన ఘటనపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని.. గాయపడిన పోలీసులకు రూ.25వేలు చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పిన తర్వాత కానీ ఆందోళనను విరమించలేదు. రీల్ లో మాత్రమే కనిపించే సీన్లు రియల్ గా చోటు చేసుకోవటం ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.