Begin typing your search above and press return to search.

గాల్లో ఫ్లైట్ గ్లాస్ ఊడితే..ప‌రిస్థితి ఇలాగే ఉంటుంది!

By:  Tupaki Desk   |   22 April 2018 6:39 AM GMT
గాల్లో ఫ్లైట్ గ్లాస్ ఊడితే..ప‌రిస్థితి ఇలాగే ఉంటుంది!
X
ఆకాశ‌యానం... ప్రాణాల‌న్నీ పైల‌ట్ చేతుల్లో పెట్టేసి ఫ్లైట్ ఎక్క‌డ‌మేన‌న్న భావ‌న మ‌రింత‌గా ఎక్కువ‌వుతోంది. క‌ఠోర శిక్ష‌ణ త‌ర్వాతే ఫ్లైట్లుగా బాధ్య‌త‌లు చేప‌ట్టే పైల‌ట్లు కొన్ని స‌మయాల్లో త‌ప్పులు చేస్తుండ‌టం వ‌ల్ల వంద‌ల మంది ప్రాణాలు గాల్లో క‌లిసిపోతున్నాయి. ఇక విమానాల్లో త‌ర‌చూ త‌లెత్తుతున్న లోపాలు కూడా చాలా సంద‌ర్భాల్లో ప్ర‌యాణికుల ప్రాణాల‌ను తీసేస్తున్నాయి. అయితే ఈ సంద‌ర్భాల్లో పైల‌ట్లు స‌మ‌యస్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించినా... ప్ర‌యాణికుల‌కు మాత్రం ప్రాణ‌భ‌యం త‌ప్ప‌డం లేదు. అస‌లు ఆకాశ‌యానాల్లో ఇలాంటి ప‌రిస్థితులు త‌లెత్తిన‌ప్పుడు గుండె ఏమాత్రం వీక్‌ గా ఉన్నా... ప్ర‌యాణికులు కేవ‌లం భ‌యంతో ప్రాణాలు పోగొట్టుకునే అవ‌కాశాలు లేక‌పోలేదు. సరే... ఏదో ప్ర‌మాదం జ‌రిగితే త‌ప్పించి... గ‌గ‌న త‌ల ప్ర‌యాణికుల‌కు ముప్పు లేద‌న్న భావ‌న ఇప్పుడు లేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. అయినా ఇంత‌టి ఉపోద్ఘాత‌మెందుకు అంటారా? అయితే అస‌లు విష‌యంలోకి వెళ్లిపోదాం.

గాల్లోకి లేచిన విమానం... ఎలాంటి అవాంతరం లేకుండానే ముందుకు సాగుతోంది. అయితే గ‌ట్టిగా వీచిన గాలికి మాత్రం ఆ విమానం కిటికీల‌కు అమ‌ర్చిన అద్దాల్లోని ఒక‌టి ఉన్న‌ప‌ళంగా ఊడిపోయింది. ఆ ఊడిపోయిన అద్దం... బ‌య‌ట‌కు ప‌డిపోయి ఉంటే ప‌రిస్థితి ఎలా ఉండేదో గానీ... బ‌య‌ట నుంచి వీస్తున్న హోరు గాలికి ఆ అద్దం లోప‌లికే గిరాటు ప‌డిపోయింది. ఆ గిరాటు ప‌డటం కూడా చాలా ఆశ్చ‌ర్యకరంగా జ‌రిగింద‌నే చెప్పాలి. ఎందుకంటే... కిటికీ నుంచి ఊడిన ఆ అద్దం దాని ప‌క్క‌నే ఉన్న ప్ర‌యాణికుడిపై ప‌డాలి. అలా కాకుండా హోరుగా వీస్తున్న గాలి కార‌ణంగా కిటికీ ప‌క్క‌నే కూర్చున్న ప్ర‌యాణికురాలితో పాటుగా దానికి అల్లంత దూరాన కూర్చున్న మ‌రో ఇద్ద‌రిని కూడా గాయ‌ప‌రిచేసింది. నిజ‌మా? అంటే.. నిజ‌మేనండీ బాబూ. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైన‌ర్‌లో చోటుచేసుకుంది.

అమృత్ స‌ర్ నుంచి ఢిల్లీకి నేటి ఉద‌యం బ‌య‌లుదేరిన ఈ విమానంలోని ఓ అద్దం విమానంలో బీభ‌త్స‌మే సృష్టించింది. విమానం గాల్లో దూసుకుపోతూ ఉండ‌గా... గాలి హోరుకు విమానం కాస్తంత అటూ ఇటూ ఉడినా... పెద్ద‌గా ఇబ్బందేమీ క‌ల‌గ‌లేదు. అయితే విమానం కిటికీల‌కు అమ‌ర్చిన ఓ అద్దం మాత్రం అమాంతం ఊడిపోయింది. ఊడిపోయిన ఆ అద్దం... విసురుగా ప్ర‌యాణికుల‌కు తాకేసింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డారు. అయితే ఊడిన అద్దాన్ని... విమానం గాల్లోనే ఉండ‌గా... దానిని య‌ధాస్థానంలో సిబ్బంది అమ‌ర్చ‌గా... గాయ‌ప‌డ్డ ప్ర‌యాణికుల‌కు తోటి ప్ర‌యాణికులు స‌ప‌ర్య‌లు చేశారు. ఆ విస్తుగొలిపే దృశ్యాలు ఈ వీడియోలో చూడండి.

వీడియో కోసం క్లిక్ చేయండి