Begin typing your search above and press return to search.

క్యాపిటల్స్ కనువిందైన షో.. ఉత్కంఠ పోరులో రైడర్స్ పై విక్టరీ

By:  Tupaki Desk   |   4 Oct 2020 3:30 AM GMT
క్యాపిటల్స్ కనువిందైన షో.. ఉత్కంఠ పోరులో రైడర్స్ పై విక్టరీ
X
ఢిల్లీ యువ ఆటగాళ్లు పరుగుల వరద పారిస్తున్నారు. వారి ధన ధన్ ఇన్నింగ్స్ తో ఆట స్వరూపాన్నే మార్చేస్తున్నారు. పరుగుల విందు చేస్తూ క్రికెట్ అభిమానుల మనసు దోచుకుంటున్నారు. శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో 228 పరుగులు చేసి 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్‌ చక్కని ప్రదర్శన చేశారు. ముఖ్యంగా శ్రేయస్‌ అయ్యర్‌ గతంలో ఎప్పుడూ లేనంత దూకుడు ప్రదర్శించాడు. సిక్సర్ల మోత మోగించాడు.

అయితే కోల్ కతా నైట్ రైడర్స్ అంత భారీ లక్ష్యం చూసినా బెదరలేదు. వారు కూడా పరుగులు చకచకా తీయడంతో మ్యాచ్ ఛేదించినంత పని చేశారు. మొత్తానికి ఇరు జట్లు భారీ స్కోర్లు సాధించి కనువిందు చేశాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ పృథ్వీ షా (66; 41 బంతుల్లో 4×4, 4×6),శ్రేయస్‌ అయ్యర్‌ (88 నాటౌట్‌; (38 బంతుల్లో 7×4, 6×6),పంత్‌ (38: 17 బంతుల్లో 5×4, 1×6) విధ్వంసం సృష్టించడంతో 228 పరుగులు చేసింది. అనంతరం 229 పరుగుల ఛేదనలో కోల్ కతా గట్టిగానే పోరాడింది. ఆ జట్టు బ్యాట్స్ మెన్లలో నితీశ్‌ రాణా (58; 35 బంతుల్లో 4×4, 4×6), మోర్గాన్‌ (44; 18 బంతుల్లో 1×,4 5×6), రాహుల్‌ త్రిపాఠి (36; 16 బంతుల్లో 3×4, 3×6) ఛేదనలో సాఫీగానే సాగుతున్నట్లు కనిపించింది. నార్జ్‌ (3/33) చెలరేగి వికెట్లు తీయడంతో చివరికి 210/8 పరుగులు మాత్రమే చేసి 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.

యువ బ్యాటింగ్ త్రయం దూకుడు

ఢిల్లీ జట్టులో ఓపెనర్ పృథ్వీ షా 41 బంతుల్లో 66 పరుగులు సాధించి మరోసారి చక్కని ఆట ప్రదర్శించగా..ఎప్పుడూ నిలకడైన బ్యాటింగ్ తో ఆకట్టుకునే శ్రేయస్‌ అయ్యర్‌ ఈసారి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. బౌండరీల మోత మోగించాడు. 38 బంతుల్లోనే 88 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

పట్టు వదలని నైట్ రైడర్స్

కొండంత లక్ష్యం చూసి కోల్ కతా బెదరలేదు. సాఫీగా లక్ష్యం దిశగా సాగింది. ముందుగా
నితీశ్‌ రాణా (58) అర్ధ సెంచరీ చేయగా కోల్‌కతా గెలవాలంటే చివరి 30 బంతుల్లో 92 పరుగులు చేయాల్సిన సమయంలో మోర్గాన్‌, రాహుల్‌ త్రిపాఠి జంట గేరు మార్చింది. వారు సిక్సర్ల మోత మోగించడంతో విజయం ఖాయమే అనిపించింది. వీళ్ల ధాటికి 16వ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. స్టాయినిస్‌ వేసిన 17వ ఓవర్లో త్రిపాఠి ఏకంగా మూడు సిక్స్‌లు, ఓ ఫోర్‌ బాదేశాడు. మోర్గాన్‌ కూడా రబాడ బౌలింగ్‌లో వరుసగా మూడు భారీ సిక్స్‌లు కొట్టాడు.

మ్యాచ్ చివర్లో ఉత్కంఠ

మోర్గాన్‌, రాహుల్‌ త్రిపాఠి జోరు మీద ఉండటంతో చివరి రెండు ఓవర్లలో 31 పరుగులు చేయాల్సి ఉండగా ఈ జంట సంచలనం సృష్టిస్తుందేమో అనిపించింది. . కానీ 19వ ఓవర్‌ తొలి రెండు బంతుల్లో రెండే పరుగులిచ్చిన నార్జ్‌ మూడో బంతికి మోర్గాన్‌ను ఔట్‌ చేయడంతో ఢిల్లీ ఊపిరిపీల్చుకుంది. . ఇక చివరి ఓవర్లో కోల్‌కతాకు 26 పరుగులు అవసరం కాగా స్టాయినిస్‌ రెండో బంతికి త్రిపాఠిని బౌల్డ్‌ చేసి ఉత్కంఠకు తెరదించాడు.

మ్యాచ్ లో హైలైట్స్

* 88 పరుగులు చేసిన శ్రేయస్‌ అయ్యర్‌ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు

* కోల్ కతా కెప్టెన్ దినేష్ కార్తీక్ వరుసగా నాలుగో మ్యాచ్ లోనూ నిరాశ పరిచాడు. కేవలం ఆరు పరుగులే చేశాడు.

* గతంలో ఎన్నో మ్యాచ్ లలో సంచలన బ్యాటింగ్ తో విజయాలు అందించి ఏకంగా బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చిన కోల్ కతా ఆటగాడు నరైన్ ఈ సీజన్లో తేలిపోతున్నాడు.ఈ మ్యాచ్ లోనూ అతడు ఫెయిల్ అయ్యాడు.

* ఢిల్లీ బౌలర్ అన్ రిచ్ నార్జ్‌ (3/33) చెలరేగడంతో మ్యాచ్ విజయంలో తన వంతు పోషించాడు. కీలక సమయంలో వికెట్లు తీశాడు.