Begin typing your search above and press return to search.

అమెరికాలో డెల్టా వేరియంట్ విజృంభణ .. 83 శాతం కేసులు దీని వలనే !

By:  Tupaki Desk   |   24 July 2021 5:04 AM GMT
అమెరికాలో డెల్టా వేరియంట్ విజృంభణ .. 83 శాతం కేసులు దీని వలనే !
X
అగ్రరాజ్యం అమెరికా పై మరోసారి కరోనా వైరస్ పంజా విసురుతోంది. డెల్టా వేరియంట్ అమెరికాపై విరుచుకుపడుతోంది. డెల్టా వేరియంట్ వైరస్ వల్ల అమెరికా లోని చాలా రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత వారం రోజులుగా డెల్టా వేరియంట్ కారణంగా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. జులై మొదటివారం నుంచి 50 శాతం పెరిగాయి. కొత్త కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్ ప్రధాన కారణమని సెంటర్ ఫర్ డిసీజెస్ అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ) నిర్దారణ చేసింది. ఈ వేరియంట్ వల్ల 83 శాతం మేర కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలియజేసింది.

ఈ మేరకు ఓ నివేదికను కోవిడ్ సెనెట్ కమిటీకి అందజేసింది. థర్డ్‌వేవ్ ముప్పు పొంచివుందంటూ నిపుణులు చేస్తోన్న హెచ్చరికల నేపథ్యంలో- అమెరికాలో పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుదల బాట పట్టాయి. ఈ మహమ్మారి దెబ్బకు తీవ్రంగా అమెరికా ఇప్పటికే తీవ్రంగా నష్టపోయింది. అత్యధిక మరణాలు, పాజిటివ్ కేసులు రికార్డయింది ఇక్కడే. పాజిటివ్ కేసుల సంఖ్య మూడున్నర కోట్లను దాటిపోయింది. ఈ మహమ్మారి దెబ్బకు అమెరికా అల్లాడిపోయింది. తీవ్రంగా ప్రాణనష్టం కూడా కలిగింది. డెల్టా వేరియంట్ వల్లే.. కొద్దిరోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగడం కలవరానికి గురిచేస్తోంది. దీనికి కారణం- డెల్టా వేరియంటేనని సీడీసీ డైరెక్టర్ రెఛెల్లె వెల్సింకీ తెలిపారు.

సెనెట్ కమిటీకి అందజేసిన నివేదికలో కీలక విషయాలను ఆమె ప్రస్తావించారు. అమెరికా దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త కేసులు అధికంగా నమోదవుతోన్నాయని..అర్కాన్సస్, ఫ్లోరిడా, మిస్సౌరీల్లో కరోనా వైరస్ వ్యాప్తి భారీగా ఉందని తెలిపారు. వాటితో పాటు అలబామా, జార్జియా, లూసియానా, మిస్సిస్సిపి, టెన్నెస్సె, టెక్సాస్‌ లల్లో ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం అనుసరిస్తోన్న కరోనా నివారణ వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కరోనా మరణాలు కూడా 48 శాతం పెరిగాయని అన్నారు. జులై 3వ తేదీ నుంచి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో అనూహ్యమైన పెరుగుదల ఉందని.. ఇది అంచనాలకు అందట్లేదని వెల్సింకీ అన్నారు. ఇంకా దేశ జనాభాలో సగం మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందని చెప్పారు. గత కొన్ని వారాలుగా టీకాల కార్యక్రమం మందగించింది. పైగా యూఎస్ వాసులు వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఇప్పటికీ ఆసక్తి చూపించకపోవటం గమనించాల్సిన విషయం. ఫలితంగా కేసులు భారీగా పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

వ్యాక్సినేషన్ రేషియో తక్కువగా ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాల్లోనే అత్యధికంగా కొత్త కేసులు నమోదువుతోన్నాయని స్పష్టం చేశారు. కిందటివారంతో పోల్చుకుంటే కొత్త కేసుల పెరుగుదల 145 శాతం మేర పెరిగందని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ గణాంకాలు స్పష్టం చేస్తోన్నాయని అన్నారు. ఈ తరహా పరిస్థితులు ఫోర్త్‌ వేవ్‌ కు కూడా దారి తీయొచ్చని మిస్సిస్సిపీ స్టేట్ హెల్త్ ఆఫీసర్ థామస్ డాబ్స్ హెచ్చరించారు. తక్షణమే కరోనా వైరస్ వ్యాప్తి చెందే పరిస్థితులను నివారించడానికి చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని, లేదంటే మరోసారి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారే ఎక్కువగా మరణిస్తున్నారని తెలిపారు. టీకా వేయించుకోని వారి పై డెల్టా వేరియంట్ ప్రభావం అధికంగా ఉన్నట్లు అమెరికా వైద్య నిపుణులు అన్నామోరీ డేవిడ్ సన్ వివరించారు. కరోనా డెల్టా వేరియంట్ కు సంక్రమణ తీవ్రత అధికమని, దీన్ని తీవ్రమైనదిగా పరిగణించాలన్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించారు.