Begin typing your search above and press return to search.

వణికించే డెల్టాకు రెట్టింపు పవర్ ఫుల్ ఈ డెల్టా ప్లస్.. రెండింటి మధ్య తేడా అదే

By:  Tupaki Desk   |   25 Jun 2021 3:58 AM GMT
వణికించే డెల్టాకు రెట్టింపు పవర్ ఫుల్ ఈ డెల్టా ప్లస్.. రెండింటి మధ్య తేడా అదే
X
ప్రపంచ వ్యాప్తంగా కలవరం రేపి..కలకలాన్ని క్రియేట్ చేసిన కొవిడ్ 19 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని దెబ్బకు ప్రపంచ దేశాలు ఎంతలా తల్లడిల్లుతున్నాయన్నది ఇప్పటివరకు చూసింది. కొవిడ్ 19కున్న మాయదారి శక్తి ఏమంటే.. ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకోవటం.. అంతకంతకూ వినూత్నంగా విరుచుకుపడటం అలవాటు. ఈ క్రమంలో మరింత అపాయకరమైన వేరియంట్ గా డెల్టాను అభివర్ణిస్తారు.

దీని కారణంగానే సెకండ్ వేవ్ లో లక్షలాది కేసులు నమోదుకావటమే కాదు.. పెద్ద ఎత్తున మరణాలకు కారణమైంది. వణికించే డెల్టాకు మించింది డెల్టా ప్లస్. బెంబేలెత్తించే ఈ వేరియంట్ మామూలుది కాదని.. మహా డేంజరస్ అన్న మాటను నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు. డెల్టా ప్లస్ తో మరింత అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికను పలువురు చెబుతున్నారు. ఇంతకీ డెల్టా వేరియంట్ కు.. డెల్టా ప్లస్ వేరియంట్ కు మధ్యనున్న వ్యత్యాసం ఏమిటి? ఇది ఎందుకంత ప్రమాదకరమన్న విషయంపై నిపుణులు చెప్పేదేమంటే..

ఈ డెల్టా ప్లస్ వేరియంట్ ను ఇంగ్లండ్ పబ్లిక్ హెల్త్ అధికారులు గుర్తించారు. ఈ నెల (జూన్) 11న దీన్ని గుర్తించినట్లు ప్రకటించారు. మన దేశంలో సెకండ్ వేవ్ పెద్ద ఎత్తున వీయటానికి.. భారీగా మరణాలు చోటు చేసుకోవటానికి కారణమైన డెల్టా వేరియంట్ లోని స్పైక్ (కొమ్ము) ప్రోటీన్ లో ‘‘కే 417’’ జన్యు మార్పు జరిగి ఈ కొత్త వేరియంట్ పుట్టింది.

ఈ తరహా జన్యుమార్పును బీటాగా పిలిచే దక్షిణాఫ్రికాలో గతంలోనే గుర్తించారు. బీటాతో పోలిస్తే డెల్టా వేరియంట్ కు త్వరగా వ్యాపించే సామర్థ్యం ఎక్కువ. అలాంటి సామర్థ్యానికి తాజా జన్యుమార్పు జత కలవటంతో డెల్టా ప్లస్ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ కొత్త వేరియంట్ పై మోనోక్లోనల్ యాంటీబాడీస్ చికిత్స ప్రభావం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

డెల్టా ప్లస్ తో ప్రమాదం ఎంత? అన్న విషయంపై ఇప్పటివరకు ఎవరికి అవగాహన లేదు. ఎవరికి వారు వారి స్థాయిలో అంచనాల్ని చెప్పటమే తప్పించి.. శాస్త్రీయ కారణాల్ని చూపిస్తూ.. జరిగే ప్రమాదం ఇంతలా ఉంటుందని మాత్రం ఎవరూ చెప్పటం లేదు. దీనిపై మరింత అధ్యయనం జరిగాల్సి ఉంది. డెల్టా ప్లస్ తో పెను ప్రమాదం ఉందని చెప్పేటోళ్లకు తగ్గట్లే.. దీనితో అంత ప్రమాదం ఏమీ లేదని చెప్పే వారు లేకపోలేదు.

ఈ మాయదారి వేరియంట్ ను తట్టుకునే శక్తి.. ఇప్పటికే టీకాలు వేసుకునే వారికి ఉంటుందా? అన్నది మరో సందేహం. కొత్త వేరియంట్ల మీద టీకాల పని తీరు అంత ప్రభావవంతంగా ఉండదన్న మాట వినిపిస్తోంది.అయితే.. దీన్ని నిరూపించటానికి సరైన లెక్కలు ఎవరి వద్దా లేవు. ఏమైనా.. మాయదారి కొవిడ్ కొత్త రూపంలో విరుచుకుపడొచ్చు. మరింత జాగ్రత్తకు మించిన మందు లేదనే చెప్పాలి.