Begin typing your search above and press return to search.

ఆల్ఫా, డెల్టాలని కట్టడి చేస్తున్న కోవాక్సిన్‌..స్పష్టం చేసిన ఎన్‌ఐహెచ్‌ !

By:  Tupaki Desk   |   30 Jun 2021 5:30 AM GMT
ఆల్ఫా, డెల్టాలని కట్టడి చేస్తున్న కోవాక్సిన్‌..స్పష్టం చేసిన ఎన్‌ఐహెచ్‌ !
X
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ ఇంకా పూర్తిగా తొలగిపోకమునుపే, ప్రపంచ వ్యాప్తంగా పలు రకాల వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా నుండి కోలుకుంటున్నాంలే అనుకుంటున్న తరుణంలోనే రోజుకో వేరియంట్ వెలుగులోకి వచ్చి ఆందోళనకి గురిచేస్తుంది. ఈ తరుణంలో దేశంలోని ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాక్సిన్ కొత్త వేరియంట్లు ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై సమర్థవంతంగా పని చేస్తున్నట్లు స్పష్టం అయింది. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ కొత్త వేరియంట్ల పై భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ వాక్సిన్ తో అధ్యయనం చేసింది.

ఈ క్రమంలో ఆల్ఫా, డెల్టా వేరియంట్లను సమర్థవంతంగా తటస్థం చేసే ప్రతిరోధకాలను కోవాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం భారత్‌ తో పాటు పలు దేశాల్లో అత్యవసర వినియోగం కింద కోవాక్సిన్‌ పంపిణీ కొనసాగుతోంది. కోవాగ్జిన్‌ టీకా తీసుకున్న వ్యక్తుల నుంచి సేకరించిన రక్త నమూనాలపై SARS-CoV-2 ఆల్ఫా (B.1.1.7) డెల్టా (B.1.617) వేరియంట్లను సమర్థవంతంగా తటస్థం చేసే ప్రతి రోధకాలను ఉత్పత్తి చేసిందని ఎన్‌ ఐహెచ్‌ మంగళవారం వెల్లడించింది. కోవ్యాక్సిన్ టీకా కరోనాపై వంద శాతం పని చేస్తోందని ఎన్ ఐ హెచ్ డైరెక్టర్ ఆంథోనీ ఫౌసీ పేర్కొన్నారు. కరోనా వైరస్ లక్షణాలున్న వారిపై 78శాతం, కరోనాతో పాటు ఇతర వ్యాధులు ఉన్నవారిపై 70 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని తమ పరిశోధనలో తేలిందని ఫౌసీ వివరించారు. ఎన్‌ ఐఏఐడీ మద్దతుతో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ భారత్‌ లో ప్రజలకు అందుబాటులో ఉన్న సమర్థవంతమైన వ్యాక్సిన్లలో ఒకటిగా భాగమైనందుకు ఆనందంగా ఉందని తెలిపారు.

కోవాక్సిన్, కేవలం మొదటి డోసు మాత్రమే కాకుండా రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి టీకా తీసుకున్నవారి శరీరంలో రోగ నిరోధక శక్తి క్రమంగా పెంపోందిస్తుంది. మరింత రోగ నిరోధక శక్తి పెంపోందేందుకు రెండవ టీకా కచ్చింతంగా తీసుకోవాలి. టీకా తీసుకున్న తర్వాత 14 రోజుల వరకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కోవిషీల్డ్ టీకా మాదిరిగా కాకుండా.. రెండు డోసుల మధ్య 12- 16 వారాల సమయం ఉండడానికి కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవాక్సిన్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య కనీసం 6 వారాల సమయం ఉండాలి.