Begin typing your search above and press return to search.

ర‌ష్యా - ఉక్రెయిన్ వార్‌.. ఆ మాత్ర‌ల‌కు డిమాండ్ అందుకేనా?

By:  Tupaki Desk   |   14 Oct 2022 9:30 AM GMT
ర‌ష్యా - ఉక్రెయిన్ వార్‌.. ఆ మాత్ర‌ల‌కు డిమాండ్ అందుకేనా?
X
త‌న పొరుగు దేశం ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధానికి ఆరు నెల‌లు దాటిపోయింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడికి దిగిన సంగ‌తి తెలిసిందే. అయితే మొద‌ట్లో సులువుగా లొంగిపోయేలా క‌నిపించిన ఉక్రెయిన్ ఏమాత్రం బెద‌ర‌కుండా యుద్ధాన్ని కొన‌సాగిస్తోంది. ర‌ష్యాతో ఏమాత్రం చ‌ర్చ‌ల‌కు వ‌చ్చేది లేద‌ని ఇప్ప‌టికే తేల్చిచెప్పింది. అంతేకాకుండా నాటోలో, యూరోపియ‌న్ యూనియ‌న్‌లో చేర‌డానికి ఉద్యుక్త‌రాల‌వుతోంది.

దీంతో ర‌ష్యా తీవ్రంగా మండిప‌డుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు విధ్వంసం ఎక్కువ చేసే ట్యాంకుల‌ను, క్షిప‌ణుల‌ను ర‌ష్యా రంగంలోకి దించ‌లేదు. అయితే ఎప్పుడ‌యితే ఉక్రెయిన్‌.. ర‌ష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవ‌డం, క్రిమియా ద్వీపంతో ర‌ష్యాను క‌లిపే వంతెన‌ను ధ్వంసం చేయ‌డం చేసిందో అప్ప‌టి నుంచి ర‌ష్యా తీవ్ర‌త‌ను పెంచింది. తీవ్ర విధ్వంసం సృష్టించే క్షిప‌ణుల‌ను కొద్ది రోజులుగా ఉక్రెయిన్‌పై ప్ర‌యోగిస్తోంది. దీంతో తీవ్ర ఆస్తి న‌ష్టం, ప్రాణ న‌ష్టం ఉక్రెయిన్‌కు సంభ‌విస్తున్నాయి.

మ‌రోవైపు అమెరికా దాని మిత్ర దేశాలు ఉక్రెయిన్‌కు స‌హాయం చేస్తే అణుదాడికి వెనుకాడ‌బోమ‌ని ర‌ష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. ఆటంబాంబు ప్ర‌యోగించే ప్ర‌మాదం ఉంద‌ని ఆయా దేశాలు, నిపుణులు భీతిల్లుతున్నాయి. మ‌రోవైపు ఇప్ప‌టికే ర‌ష్యా.. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద అణువిద్యుత్ ప్లాంట్ జ‌జోపోరియాపై చేసిన దాడుల‌తో అక్క‌డ మంట‌లు చెల‌రేగాయి. దీంతో యూర‌ప్ దేశాలు భీతిల్లాయి. అక్క‌డ మంట‌ల‌ను ఉక్రెయిన్ వెంట‌నే అదుపులోకి తెచ్చింది.

మంట‌లు వ్యాపించి ఉంటే భారీ ఎత్తున రేడియేష‌న్ వెలువ‌డేది అని చెబుతున్నారు. ఇప్ప‌టికే భారీ ఎత్తున రేడియేష‌న్ వ్యాపించింద‌ని చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా ర‌ష్యా అణుదాడి చేస్తే వెలువ‌డే రేడియేష‌న్‌తో ల‌క్ష‌లాది ప్ర‌జ‌లు మ‌ర‌ణించ‌డం, మిగ‌తా వారు రేడియేష‌న్ ధాటికి జీవ‌చ్ఛ‌వాల్లా బతుకు వేలాడ‌దీయాల్సిన దుస్థితి ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఐరోపా దేశాల్లో ప్రస్తుతం అయోడిన్‌ మాత్రలకు డిమాండ్ బాగా పెరిగింది. ఐరోపాలోని పలు దేశాలు అయోడిన్ మాత్ర‌ల‌ను భారీగా నిల్వ చేసుకుని పెట్టుకుంటున్నాయి. ప్రజలు ఇప్పటికే విపరీతంగా కొనుగోలు చేసి పెట్టుకోవ‌డం బ‌ల్గేరియా, చెక్ రిప‌బ్లిక్‌, ఫిన్లాండ్‌, స్లోవేకియా త‌దిత‌ర దేశాల్లోని అనేక ఫార్మసీల్లో వాటి నిల్వలు నిండుకున్నాయి.

అయోడిన్ మాత్రలకు రేడియేష‌న్ నుంచి ర‌క్షించ‌గ‌ల సామ‌ర్థ్యం ఉండ‌ట‌మే ఆయా దేశాలు అయోడిన్ మాత్ర‌ల‌ను భారీగా నిల్వ చేసుకోవ‌డానికి కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. ఒకరకమైన రేడియేషన్‌ నుంచి శరీరానికి అవి రక్షణ కల్పించగలవు అని పేర్కొంటున్నారు.

అణు దాడి లేదా అణు ప్రమాదాలు జరిగినప్పుడు రేడియోధార్మిక అయోడిన్‌ వాతావరణంలోకి పెద్ద ఎత్తున విడుదలవుతుంద‌ని అంటున్నారు. ఈ రేడియోథార్మిక అయోడిన్‌ మనిషి శరీరంలోకి చేరితే థైరాయిడ్‌ క్యాన్సర్‌ బారినపడే ముప్పు ఎక్కువ అవుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ముఖ్యంగా రోగ నిరోధ శ‌క్తి త‌క్కువ ఉండే వృద్ధులు, చిన్నారుల్లో ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మ‌నిషి ఆరోగ్యంపై రేడియోధార్మిక అయోడిన్‌ ప్రతికూల ప్రభావం ఏళ్ల త‌ర‌బ‌డి కొనసాగే అవకాశాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వివ‌రిస్తోంది.

కాగా అయోడిన్ మాత్ర‌లు ఎలా ప‌నిచేస్తాయంటే.. వీటిలో పొటాషియం అయోడైడ్‌ అనే రసాయనిక సమ్మేళనం ఉంటుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటిని తీసుకోవడం వల్ల మెడలో ఉండే థైరాయిడ్‌ గ్రంథి.. స్థిరమైన అయోడిన్‌ (పొటాషియం అయోడైడ్‌)తో నిండుతుంద‌ని వివ‌రిస్తున్నారు. కాబట్టి అణు దాడి కారణంగా రేడియోధార్మిక అయోడిన్‌ విడుదలైనా.. అది మ‌నిషి శ‌రీరంలోని థైరాయిడ్‌ గ్రంథిలోకి వెళ్లేందుకు ఆస్కారమే ఉండద‌ని చెబుతున్నారు. తద్వారా అణు దాడుల సమయంలో కొంతవ‌ర‌కు రక్షణ ల‌భించే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంటున్నారు.

అయితే అయోడిన్ మాత్ర‌ల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు కాకుండా రేడియేషన్‌ బారిన పడటానికి కొంతసేపు ముందు మాత్ర‌మే ఈ మాత్రలను తీసుకుంటే ప్రయోజనం ఉంటుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.