Begin typing your search above and press return to search.

మునుగోడులో గల్లీ నేతలకు డిమాండ్.. ఎంతిస్తే ఆ పార్టీలోకే?

By:  Tupaki Desk   |   16 Aug 2022 5:11 AM GMT
మునుగోడులో గల్లీ నేతలకు డిమాండ్.. ఎంతిస్తే ఆ పార్టీలోకే?
X
ఉప ఎన్నికలు వస్తే చాలు ఆ నియోజకవర్గం అభివృద్ధి బాట పడుతుంది. అది దుబ్బాక అయినా.. హుజూరాబాద్ అయినా సరే కేసీఆర్ కోట్లు తెచ్చి అక్కడ కుమ్మరిస్తారు. ముందుగాల నేతలను కొనేస్తారు. అనంతరం ఇంటింటికి పథకాల పేరుతో వేలకు వేలు తగలేస్తారు. అందుకే ఉప ఎన్నికలు రావాలని.. అప్పుడే తమ నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు భావిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు మునుగోడు నేతలు, ప్రజల పంట పండింది. ఉప ఎన్నికలు రావడంతో ముందుగా పార్టీ నేతలకు డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతల దరిద్రం, అష్టకష్టాలన్నీ దూరమైపోతున్నాయి.కాంగ్రెస్ గెలిచిన ఈ సీటులో కాంగ్రెస్ నేతల కోసం టీఆర్ఎస్, బీజేపీలో పోటీలు పడి మరీ లక్షలు కుమ్మరించి వారిని తమ పార్టీలో చేర్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. చోటా మోటా, నలుగురిని పోగేసుకొనే గల్లీ లీడర్స్ కు కూడా మునుగోడులో భారీ డిమాండ్ నెలకొందంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెసోళ్లే కాదు.. అన్ని పార్టీల నేతలకూ ఇప్పుడు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట.. మా పార్టీలో చేరాలని లక్షలు ఆఫర్లు ఇస్తున్న పరిస్థితి నెలకొంది.

మునుగోడులో ఇప్పుడు జంపింగ్ జపాంగ్ నడుస్తోంది. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే నిర్మోహమాటంగా పార్టీలేదు గీర్టీ లేదంటూ జంపింగ్ చేసేస్తున్నారు. ఎవరు ఎంతిస్తే ఆ పార్టీలోకే జంప్ అవుతున్నారు.అత్యధికంగా స్థానిక సంస్థల్లో గెలిచిన సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వార్డుమెంబర్లకు గిరాకీ ఉంది. ఈ లీడర్లందరికీ బోలెడంత డిమాండ్ ఉంది. వీరికి టీఆర్ఎస్, బీజేపీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. చాలా మంది ఈ ఉప ఎన్నికతో తమ ఆర్థిక అవసరాలు తీరుతాయని పార్టీలు ఉన్న ఫళంగా మారిపోతున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ భారీ ఆఫర్లకు ఆ పార్టీలో చేరిపోతున్నారు.

మునుగోడులో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. వారికి టీఆర్ఎస్ గాలం వేస్తూ లాగేస్తోంది. ఇక రాజగోపాల్ రెడ్డి వెంట బీజేపీలోకి వెళ్లడానికి కాంగ్రెస్ నేతలు ఇష్టపడడం లేదు. ఆయనతో వెళితే ఓడిపోతామని టీఆర్ఎస్ లో చేరుతున్నారు. టీఆర్ఎస్ ఆఫర్లకు వెళ్లాలనుకునే వారికి రాజగోపాల్ రెడ్డి ఆపేస్తూ తను కూడా వారి ఖర్చులు భరిస్తున్నాడని సమాచారం.

ఓ వైపు టీఆర్ఎస్, మరో వైపు బీజేపీ ఇలా ఇరు వైపులా ఆఫర్లు ఇస్తూ లక్షలు ముట్టచెప్పుతుండడంతో మునుగోడులో ఇప్పుడు చోటామోటా.. గల్లీ నేతల పంట పండుతోంది. కాంగ్రెస్ నేతలనే ఎక్కువగా కొంటుండడంతో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి బతిమిలాడుకుంటున్న పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నేత చల్లమల్ల కృష్ణారెడ్డిని రంగంలోకి దింపి పార్టీ నేతలు జారిపోకుండా వారికి భరోసానిస్తున్నారు. వారి కోరికలు తీర్చేందుకు ఒప్పుకుంటూ పార్టీలోనే ఉండేలా ఒప్పిస్తున్నారు.

కరోనా సోకి ఇంట్లో క్వారంటైన్ లో ఉన్న రేవంత్ రెడ్డి 20వ తేదీ నుంచి మునుగోడులోనే ఉంటానని.. అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని భరోసా కల్పిస్తున్నారు. కేడర్ కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. క్యాడర్ జారిపోతే కాంగ్రెస్ గెలవడం కష్టం కాబట్టి టీఆర్ఎస్, బీజేపీ ప్లాన్లను రేవంత్ రెడ్డి ఎలా అడ్డుకుంటాడన్నది వేచిచూడాలి.