Begin typing your search above and press return to search.

బ్యాంకులు డల్.. పోస్టాఫీసులు ఫుల్

By:  Tupaki Desk   |   15 March 2017 4:47 AM GMT
బ్యాంకులు డల్.. పోస్టాఫీసులు ఫుల్
X
ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయన్న నానుడి ప్రస్తుతం దేశంలో ప్రాథమిక ఆర్థిక సేవల వ్యవస్థలో వస్తున్న మార్పులకు అతికినట్లు సరిపోతుంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి కోలుకుని గట్టిగా నెల రోజులు కూడా కాకుండా మళ్లీ దేశంలో నగదు లభ్యత పూర్తిగా తగ్గిపోవడం.. ఏటీఎంల్లోనే కాకుండా బ్యాంకుల్లోనూ నో క్యాష్ బోర్డులు పెడుతుండడం తెలిసిందే. ఇది చాలదన్నట్లు బ్యాంకులు ఛార్జీల పేరుతో నిలువు దోపిడీకి రంగం సిద్ధం చేశాయి.. ఈ నేపథ్యంలో ఏ ఛార్జీలు లేకుండా నగదు సేవలు అందించే పోస్టాఫీసుల వైపు ప్రజలు మళ్లుతున్నారు. దీంతో ఇంతకాలం పట్టించుకునేవారు లేక ఆదరణ కోల్పోతున్న పోస్టాఫీసులకు మళ్లీ గిరాకీ మొదలైంది.

రోజుకో రూలు... ప్రతి పనికీ పైసలు అన్నట్లుగా ప్రజలు పీడించుకు తినడానికి సిద్ధమవుతున్న బ్యాంకులంటే ప్రజలకు ఆగ్రహం పెల్లుబుకుతోంది. బ్యాంకులకు బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారు. పోస్టాఫీసుల్లో వంద రూపాయలకే ఖాతా తెరిచే వీలుండడం - ఖాతాలో కనీస మొత్తం ఆంక్షలు లేకపోవడం, గరిష్టంగా ఎంతైనా జమచేసుకునే వీలుండడంతో ఖాతాలు తెరిచేందుకు పోస్టాఫీసుల ముందు క్యూకడుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పోస్టాఫీసులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. కొత్త ఖాతాలతో కళకళలాడిపోతున్నాయి.

పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా తెరిచేందుకు కేవైసీ నియమాలను పాటించాలని, డబ్బు జమను బట్టి పాన్ - ఇతర వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని పోస్టల్ అధికారులు చెబుతున్నారు. ఖాతా తెరిచిన అనంతరం 15 రోజుల్లో ఏటీఎం కార్డు వస్తుంది. ఈ కార్డును ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా ఉపయోగించుకోవచ్చు. పెద్ద నగరాల్లో అయితే పోస్టల్ ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ - ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం కూడా ఉంది. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే ఇప్పటివరకు 5 లక్షలకు పైగా సేవింగ్ అకౌంట్లు ఉన్నాయి. కేవలం ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు లక్ష మంది ఖాతాలు తెరిచారట. ఇప్పటికౌనా బ్యాంకులు మేలుకోకపోతే ప్రజలు మళ్లీ వాటి ముఖం కూడా చూడరు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/