Begin typing your search above and press return to search.
జాతిపిత ఇంటినీ కూల్చేయమన్నారు
By: Tupaki Desk | 27 March 2017 10:15 AM GMTపొరుగు దేశం పాకిస్థాన్ జాతి పిత మహ్మద్ అలీ జిన్నా ఇంటిని కూల్చండంటూ ముంబైలోని ఓ టాప్ బిల్డర్ ప్రభుత్వాన్ని కోరాడు. దక్షిణ ముంబైలో రెండున్నర ఎకరాల్లో ఉన్న జిన్నా ఇంటిని కూల్చి.. ఆ ప్రదేశంలో ఓ సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించాలని మంగళ్ ప్రభాత్ లోధా అనే రియల్ ఎస్టేట్ డెవలపర్ అంటున్నాడు. ప్రస్తుతం ఈ ఇంటి విలువ రూ.2600 కోట్లు ఉంటుంది.
దేశ విభజన కుట్రకు బీజం పడింది ఈ జిన్నా ఇంటి నుంచే. `ఈ ఇళ్లు రెండు దేశాల విభజనకు కేంద్ర బిందువు. అందుకే దీన్ని కూల్చేయాలి`` అని లోధా వాదిస్తున్నాడు. 1930ల్లో నిర్మించిన ఈ భారీ భవంతి నిర్వహణ కోసం కోట్లు వృథా చేస్తున్నారని ఆరోపించాడు. ఈ ఇల్లు చాలా కాలం వరకు బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ నివాసంగా ఉంది. అయితే 1982 నుంచి ఇది ఖాళీగానే ఉంది. దేశ విభజన కోసం జిన్నా, భారతదేశ నేతల మధ్య చర్చలకు ఈ ఇల్లే కేంద్రంగా ఉంది. ఈ ఇంటిని తమకు అమ్మడమో, లీజుకు ఇవ్వడమో చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం చాలాసార్లు కోరింది. అయితే భారత్ ఈ కోరికను మన్నించలేదు.. అలాగని నిరాకరించలేదు.
ప్రస్తుతం తాళం వేసి ఉన్న ఈ ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. జిన్నా కూతురు దినా వాడియా 2007లో ఇంటి యాజమాన్య హక్కులు తమకు ఇవ్వాల్సిందిగా కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆమె కుమారుడు నుస్లీ ముంబైలోనే పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. విభజన తర్వాత దేశం విడిచి పాకిస్థాన్ వెళ్లిపోయిన వారి ఆస్తులను నిర్వాసితు ఆస్తులుగా భారత్ గుర్తించింది. అయితే జిన్నా, ఆయన కూతురిని మాత్రం అప్పటి ప్రధాని నెహ్రూ నిర్వాసితులుగా గుర్తించలేదు. వాళ్ల ఇంటిని కూడా నిర్వాసిత ఆస్తిగా నమోదు చేయలేదు. విభజన సమయంలో పాక్, చైనాలకు వెళ్లిపోయిన వారి వారసులకు ఇక్కడి ఆస్తులపై ఎలాంటి హక్కు లేదని గత వారమే ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కు పార్లమెంట్ సవరణ చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/