Begin typing your search above and press return to search.

నోట్ల రద్దుతో 2 లక్షల ఉద్యోగాలు ఔట్‌

By:  Tupaki Desk   |   7 May 2017 5:28 AM GMT
నోట్ల రద్దుతో 2 లక్షల ఉద్యోగాలు ఔట్‌
X
ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోడీ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌క‌టించిన పెద్ద నోట్ల ర‌ద్దు తాలూకు విప‌రిమాణాల‌పై అధికారికంగా వెలువ‌డిన నివేదికలో సామాన్యుల‌పై ప‌డిన ప్ర‌భావాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపిస్తోంది. సర్కారు నోట్ల రద్దు నిర్ణయం అసంఘటిత రంగంలోని కార్మికులను కోలుకోలేని దెబ్బతీసింది. మోడీ ఈ నిర్ణయం తీసుకున్నాక ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న రెండు లక్షల మంది ఉద్యోగాలు గల్లంతయ్యాయి. మరో 46 వేలమంది పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలకు కోత పడింది. 2016 అక్టోబర్‌ నుంచి 2017 జనవరి మధ్య కార్మికులు ఉపాధి కోల్పోయినట్టు ప్రభుత్వ నివేదికేే వెల్లడించడం గమనార్హం.

పెద్ద‌ నోట్ల రద్దు తర్వాత తీవ్ర నగదు కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం చిన్న తరహా పరిశ్రమలపై ఎక్కువ ప్రభావం పడిందని నివేదికలో బహిర్గతమైంది. వ్యవసాయేతర రంగాలైన తయారీ - నిర్మాణ - కార్మిక - రవాణా - వసతి - రెస్టారెంట్లు - ఐటీ - బీపీఓ - విద్యా - ఆరోగ్య రంగాలకు సంబంధించి ఈ వివరాలు సేకరించారు. నిర్మాణ రంగంలో సుమారు 1.10 లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయ్యారు.

ఈ కాలంలో పార్ట్‌ టైంకు సంబంధించి 46 వేల మంది ఉద్యోగాలను కోల్పోయారు. నోట్ల రద్దు ప్రభావంతో కార్మికుల జీతాల్లో భారీగా కోతలు పెట్టాల్సి వచ్చినట్టు కూడా తేలింది. ఐటీ - బీపీఓల్లో కూడా ప్రభావం కనిపించింది. నిర్మాణరంగంలో పనిచేస్తున్న పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలపై అధిక ప్రభావం పడింది. 2017లో నిర్మాణ - రవాణ - బీపీఓ - విద్య - ఆరోగ్య విషయాల్లో పురోగమన మార్పులు వచ్చాయని గుర్తించింది. అయితే వసతి - రెస్టారెంట్లలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇందులో కార్మికుల సంఖ్య 1.39 లక్షలు కాగా, కాంట్రాక్టు కార్మికుల సంఖ్య 1.24 లక్షలుగా నమోదైంది.

కాగా, ప్రతి ఏటా 2.5 కోట్ల మందికి ఉద్యోగాలిస్తామని మోడీ ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రతి ఏటా 1.2 కోట్ల మంది కార్మికులు కొత్తగా చేరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసంఘటిత రంగంతో పాటు కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి దొరకటం మరింత జఠిలంగా మారనున్నదని నిపుణులు చెబుతున్నారు. కాగా, వాస్తవానికి నోట్ల రద్దు ప్రభావంతో కోట్లాది సంఖ్యలో కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు, పలు రంగాలకు చెందిన వారు ఉపాధిని కోల్పోయారని ప్రజా, ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/