Begin typing your search above and press return to search.

జీవిత బీమాకు డీమోనిటైజేషన్ ధీమా

By:  Tupaki Desk   |   18 Dec 2016 4:49 PM IST
జీవిత బీమాకు డీమోనిటైజేషన్ ధీమా
X
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నా కొందరు మాత్రం హర్షిస్తున్నారు. అలాగే ఈ నిర్ణయంతో చాలారంగాల్లో వృద్ధి నిలిచిపోయినా కొన్ని రంగాల్లో మాత్రం వ్యాపారాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా డిజిటల్ పేమెంట్లలో అనూహ్యంగా ఊపొచ్చింది. అదేసమయంలో బీమా సంస్థలకూ మంచి ప్రయోజనాలు కలిగాయట. దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ ఐసీ కూడా డీమానిటైజేషన్ తో బాగానే లాభపడిందని చెబుతున్నారు.

ముఖ్యంగా ఎల్ ఐసీలో ఖరీదైన పాలసీలు బాగా విక్రయమవుతున్నాయట. జీవన్ అక్షయ్ అనే పెన్షన్ ప్లానుకు విపరీతమైన డిమాండు ఏర్పడిందట. ఒక్క ముంబయిలోని దాదార్ బ్రాంచిలోనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ.50 కోట్ల కు జీవన్ అక్షయ్ ప్లాను తీసుకున్నారని తెలుస్తోంది. ఎల్ ఐసీ వర్గాలు ఆయన పేరును బయటపెట్టడం లేదు.

బాలీవుడ్ కు చెందిన ఒక నటుడు కూడా 2 కోట్లకు పెన్షన్ ప్లాను తీసుకున్నాడట. దీనివల్ల ఆయనకు ఏడాదికి 15 లక్షల పెన్షన్ వస్తుంది. అయితే.. దాదర్ బ్రాంచిలో జరిగిన ఈ లావాదేవీల సమాచారం బయటకు పొక్కడంతో ఇదంతా ఎలా వెల్లడైందో చెప్పాలంటూ ఆ సంస్థ ఆ బ్రాంచి మేనేజర్ ను వివరణ అడిగింది. ఈ ఒక్క ప్లాను, ఈ ఒక్క బ్రాంచి అనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని ఎల్ ఐసీ బ్రాంచిల్లో అన్ని రకాల ప్లాన్లు బాగా సేల్ అయినట్లు చెబుతున్నారు. మిగతా ప్రయివేటు బీమా సంస్థలకు కూడా వ్యాపారం భారీగా పెరిగిందట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/