Begin typing your search above and press return to search.

నోట్ల రద్దుపై ఫోర్బ్స్ ప్రపంచానికిచ్చే సంకేతం!

By:  Tupaki Desk   |   24 Dec 2016 6:03 AM GMT
నోట్ల రద్దుపై ఫోర్బ్స్ ప్రపంచానికిచ్చే సంకేతం!
X
నోట్లరద్దు విషయాన్ని భాజాపా ఏస్థాయిలో సమర్ధించినా - ఆ విషయాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై మోడీ ఎలాంటి సెటైర్స్ వేసినా ఫైనల్ గా ప్రతిష్టాత్మక నోట్ల రద్దు నిర్ణయం లక్ష్యానికి దూరంగా తగిలినట్టే అనేది దాదాపుగా ఒప్పుకోవాల్సిన విషయం! ఈ విషయం గ్రహించిన కేంద్రంలోని పెద్దలు.. ఇది తొలి అడుగు మాత్రమే, దీనితోనే అంతా అయిపోదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం ఆ బాణం లక్ష్యానికి ఎంత దూరంలో తగిలిందో చెప్పడానికి ఒక ఉదాహరణ. ఇక నల్లధనమంతా ఇప్పటికే అధికారికంగా బ్యాంకులకు చేరిపోయిందనేది తాజా కథనాల సారాంశం. ఇక సామాన్యుడి కోణం నుంచి చూస్తే... నోట్ల రద్దు నిర్ణయం వల్ల గంటలు, కాదు కాదు రోజుల తరబడి క్యూలో నిల్చున్నామని, చేతిలో డబ్బులు లేక, ఏటియంల ముందు "నో క్యాష్" అని బోర్డుల వల్ల పడిన నరకం అంతా ఇంతా కాదని చెబుతూనే ఉన్నారు. సరే నోట్ల రద్దులో ఉన్న దేశప్రయోజనాలు - మేధావి తనం సామాన్యుడికి కొంతమేర అర్ధం కాలేదు అనుకుంటే తాజాగా అంతర్జాతీయ వాణిజ్య పత్రికలు ఈ విషయాన్ని ఎలా చూస్తున్నాయనేది తాజాగా ఫోర్బ్స్ పత్రిక కథనంతో తెలుస్తుంది.

నిజంగానే కాసేపు మోడీ తీసుకున్న నిర్ణ‌యం సామాన్యుడికి - ప్రతిపక్షాలకు - బీజేపీని వ్యతిరేకించే ఆర్థిక వేత్తలకు - మేధావులకు - ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన అమర్త్య సేన్ వంటి వారికి అర్థం కాలేదు అనుకుందాం!! వారంతా కావాలనే ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నారని సరిపెట్టుకుందాం. క‌నీసం ఫోర్బ్స్ లాంటి ప్ర‌ముఖ వాణిజ్య ప‌త్రిక‌లైనా ఈ విషయంలో పాజిటివ్ విషయాలను అర్ధం చేసుకోవాలి, అభినందించాలి క‌దా! అవి ప్రతిపక్ష పత్రికలైతే కాదు కదా!! కానీ అవి కూడా అలా అన‌డం లేదు. భార‌తదేశంలో భాజ‌పా స‌ర్కారు తీసుకున్న నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంపై ఫోర్బ్స్ ప‌త్రిక తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేసింద‌ని చెప్పుకోవాలి. "నోట్ల ర‌ద్దును ఎలా చెయ్య‌కూడ‌దు - నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎలా అమలు చేయకూడదు అనేది చెప్ప‌డానికి ప్రపంచానికి ఇదో ఉదాహ‌ర‌ణ‌" అని ప్ర‌ముఖ వాణిజ్య ఫోర్బ్స్ అభిప్రాయ‌ప‌డింది. ఈ ఒక్క లైన్ చాలు నోట్ల రద్దు విషయంపై పరిస్థితిని చెప్పడానికి! ఇదే క్రమంలో నోట్ల ర‌ద్దు త‌రువాత మోడీ స‌ర్కారు తీసుకున్న చ‌ర్య‌ల్ని కూడా క‌డిగిపారేసింది.

రాత్రికి రాత్రి మీడియా సమావేశం పెట్టి తెల్లవారిన దగ్గరనుండి 120కోట్లకు పైగా ఉన్న జనాలను మీచేతిలో ఉన్న నోట్లు చెల్లవని, ఉన్నపలంగా అంతా న‌గ‌దు ర‌హితం వైపు వెళ్లిపోవాల‌ని చెప్ప‌డం అవివేకం కాక మరేమిటని వ్యాఖ్యానించింది. ఇదె క్రమంలో నోట్ల ర‌ద్దును దేశ ప్ర‌జ‌ల‌పై బ‌ల‌వంతంగా రుద్దడం ఏమాత్రం స‌రైన చర్య కాద‌ని ఆ పత్రిక అభిప్రాయపడింది. ఈ విషయంలో కేవలం విమర్శలకే పరిమితం అయ్యిందనుకుంటే పొరపాటే... డిజిట‌ల్ ఎకాన‌మీ అనేది చాలా సులువైన మార్గాల ద్వారా, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో ప్ర‌జ‌ల‌కు అల‌వాటు చేయాల‌ని ఫోర్బ్స్ సూచించింది.

ఈ రేంజ్ లో ఒక అంత‌ర్జాతీయ వాణిజ్య ప‌త్రిక స్పందించిందీ అంటే... ఇది కూడా ప్ర‌తిప‌క్ష పార్టీల విమ‌ర్శ‌గానే కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుంటుందా? ఈ కథనాన్ని నిశితంగా పరిశీలిస్తే... దేశాన్ని ఆర్థిక సంక్షోభం అంచుల‌కు తీసుకెళ్లిపోతున్నార‌నే ఆవేద‌న ఆర్థికవేత్త‌ల నుంచి వ్య‌క్త‌మౌతోంది. అలా అని మోడీ తన అభిప్రాయాలను గౌరవించే ఆర్థికవేత్తల సలహాలు తీసుకోలేదని అనుకోలే కానీ... మన్మోహన్ - అమర్త్యసేన్ వంటివారిని పక్కనపెట్టి నిర్ణయం తీసుకోవడం బాదాకరమే! అయితే కేవలం విమ‌ర్శల్ని తిప్పి కొట్ట‌డంపైనే కాకుండా ఆ విమ‌ర్శ‌ల‌ను విశ్లేషించే స్థాయికి మోడీ చేరుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా... మోడీ నిర్ణ‌యంపై అంత‌ర్జాతీయ వాణిజ్య స‌మాజంలో ఇలాంటి అభిప్రాయం ఏర్పడటం శుభపరిణామం అయితే కాదనే ఒప్పుకోవాలి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/