Begin typing your search above and press return to search.

గంటకు రూ.54లక్షల జీతం.. ఆమేం చేస్తుంటారు?

By:  Tupaki Desk   |   12 April 2021 4:17 AM GMT
గంటకు రూ.54లక్షల జీతం.. ఆమేం చేస్తుంటారు?
X
మీరు చదివింది కరెక్టే. ఊహకు అందనంత జీతం ఆమె సొంతం. 53 ఏళ్ల వయసులో ఆమెకు అంత జీతం.. అది కూడా గంటలో అంటే నమ్మశక్యంగా అనిపించట్లేదు కదా? కానీ.. ఇదే నిజం. అది కూడా 2019-20 నాటి ఆర్థిక సంవత్సరంలో ఆమె ఆదాయంగా చెప్పాలి. ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేస్తుంటారు? లాంటి సందేహాలు మదిని తొలిచేస్తున్నాయా? అక్కడికే వస్తున్నాం.

ఆమె పేరు డెనిస్ కొయెత్స్. ఆమెకు 53 ఏళ్లు. ఉండేది బ్రిటన్ లో. ఆమెకు ఏడాది జీతం రూ.4వేల కోట్లు. అంటే.. రోజుకు రూ.13 కోట్లు. అంటే.. గంటకు జస్ట్ రూ.54 లక్షలు మాత్రమే. ఇంతకూ ఆమెకు అంత జీతం ఎందుకు ఇస్తున్నారంటే.. ఆమె బెట్ 365 సంస్థ బాస్. ఈమెకు సదరు కంపెనీలో 50 శాతం వాటా ఉంది. దీంతో.. కంపెనీ బాస్ గా ఆమెకు వచ్చే జీతంతో పాటు.. వాటాలతో కలిపి వస్తే ఆదాయం భారీగా ఉంటుంది. కంపెనీ బాస్ గా 421 మిలియన్ పౌండ్లు.. 50 శాతం వాటా ఉన్నందున డివెడెండ్ కింద 48 మిలియన్ పౌండ్లను వస్తుంటాయి.

ఈ రెండింటిని కలిపితే 2019-20 నాటి పౌండ్ విలువ మన రూపాయిల్లో లెక్కిస్తే రూ.4742వేలకోట్లుగా చెప్పాలి. యూకే చరిత్రలో అత్యధిక వార్షిక వేతనం ఆమెదే కావటం గమనార్హం. మరింత వివరంగా చెప్పాలంటే.. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ వార్షిక వేతనానికి సుమారు 2360 రెట్లు ఎక్కువ. బ్రిటన్ లోని వంద పెద్ద కంపెనీల సీఈవోల వార్షిక వేతనం కలిపినా.. ఆమె వార్షిక ఆదాయమే ఎక్కువ. అంతేకాదు.. బ్రిటన్ లో అత్యంత సంపన్నమైన మహిళల్లో ఆమెది ఐదో స్థానం. ఇన్ని తెలిసిన తర్వాత ఆమెను.. ‘వావ్’ అనకుండా ఉండలేం.