Begin typing your search above and press return to search.

కేసీఆర్ తాజా రివ్యూలోనూ హోంమంత్రి అలీ కనిపించలేదే?

By:  Tupaki Desk   |   6 April 2020 5:20 AM GMT
కేసీఆర్ తాజా రివ్యూలోనూ హోంమంత్రి అలీ కనిపించలేదే?
X
కొద్ది రోజుల క్రితం ప్రగతిభవన్ కు వచ్చిన తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీని అక్కడి పోలీసులు ఆపేయటం తెలిసిందే. హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతం.. కరోనా కారణంగా పక్కకు వెళ్లిపోయింది. ఒక రాష్ట్ర హోం మంత్రిని పోలీసులు అడ్డుకోవటం.. ముఖ్యమంత్రిని కలుసుకోవటానికి సైతం అనుమతించకపోవటం షాకింగ్ గా మారింది. అయితే.. మీడియాలో వచ్చిన రిపోర్టులకు భిన్నమైన వాదనను వినిపించారు మహమూద్ అలీ.

తాను ముఖ్యమంత్రి నివాసం వైపు వెళుతున్నవేళ.. ప్రగతిభవన్ లోకి వెళ్లాలని అనుకున్నానని.. కానీ అక్కడకు వెళ్లే సమయానికి తన ఆఫీసు నుంచి వచ్చిన ఫోన్ కాల్ కారణంగా తాను వెళ్లిపోయినట్లుగా అలీ చెప్పుకున్నారు. ఎప్పుడూ నెగిటివేనా? కాస్త అయినా పాజిటివ్ ఉండదా? అన్న లెక్కలోకే పోయి చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపించక మానదు.

ప్రగతిభవన్ వద్ద హోంమంత్రివర్యుల్ని ఆపేసిన తర్వాత.. మళ్లీ ముఖ్యమంత్రితో అలీని చూడలేదన్న వాదన వినిపిస్తోంది. ఎక్కడిదాకానో ఎందుకు? ఆదివారం ప్రగతి భవన్ లో పెద్ద ఎత్తున సమీక్షను నిర్వహించారు. గంటల కొద్దీ సాగిన సమీక్షా సమావేశం ఆదివారం రాత్రి పది గంటల వేళలో ముగిసినట్లు చెబుతున్నారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌ సత్యనారాయణ రెడ్డి ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంత కుమారి, రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

ఇలా పెద్ద తలకాయలు అన్ని ఉన్నా.. ఒక లోటు కనిపించట్లేదు? ఇంత కీలకమైన వారంతా సమీక్షలో ఉన్నప్పుడు హోం మంత్రి మహమూద్ అలీ మాత్రం ఎందుకు రాలేదంటారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకీ.. ఆదివారం వేళ. అలీసాబ్ ఏం చేస్తున్నట్లు? ప్రగతిభవన్ సమీక్షలో హోం మంత్రిని ఎందుకు ఆహ్వానించలేదు? అన్నదిప్పుడు అనుమానంగా మారింది. దీనికి కాస్త క్లారిటీ ఇవ్వరాదు సారూ?