Begin typing your search above and press return to search.

మీ రెడ్లంతా ఇలాగే మాట్లాడ‌తారా?: డిప్యూటీ సీఎం ఆగ్ర‌హం!

By:  Tupaki Desk   |   5 Oct 2022 4:43 AM GMT
మీ రెడ్లంతా ఇలాగే మాట్లాడ‌తారా?:  డిప్యూటీ సీఎం ఆగ్ర‌హం!
X
చిత్తూరు జిల్లా గంగాధ‌ర నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం క‌ళ‌త్తూరు నారాయ‌ణ‌స్వామి చేసిన వ్యాఖ్య‌లు వివాదం రేపుతున్నాయి. ప్ర‌స్తుతం గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా నారాయ‌ణ‌స్వామి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పెనుమూరు మండ‌లం ఉగ్రాణంప‌ల్లెలో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు ఆయ‌న వద్ద‌కు వెళ్లి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు.

విశ్రాంత ఎంఈవో, న్యాయ‌వాది మోహ‌న్‌రామిరెడ్డి కూడా ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి వ‌ద్ద‌కు వెళ్లి స‌మ‌స్య‌ను చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు. త‌మ‌ విద్యుత్తు ఉపకేంద్రంలో ఏఈ, సిబ్బంది కొరత ఉంద‌ని నారాయ‌ణ‌స్వామి దృష్టికి తెచ్చారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంద‌ని తెలిపారు. దీనిపై నారాయ‌ణ‌స్వామి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మీర‌లా మాట్లాడ‌కండి.. రెడ్లంతా ఇలాగే మాట్లాడ‌తారా అంటూ మోహ‌న్‌రామిరెడ్డిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంద‌ని స‌మాచారం. ఇంత‌లో ఎస్సై అనిల్ కుమార్.. మోహ‌న్‌రెడ్డిని అక్క‌డి నుంచి ప‌క్క‌కు తీసుకెళ్లడానికి ప్ర‌య‌త్నించారు. దీంతో ఎస్సైకి, మోహ‌న్‌రెడ్డికి మ‌ధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి, ఎస్సైపై రామిరెడ్డి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదును తీసుకోవ‌డానికి పోలీసు సిబ్బంది తిర‌స్క‌రించారు. దీంతో నారాయ‌ణ‌స్వామితోపాటు ఎస్సై తనను అనవసరంగా దూషించారని, ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని చెబుతూ మోహ‌న్‌రామిరెడ్డి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.

కాగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు అత్యంత వీర విధేయుడుగా పేరున్న క‌ళ‌త్తూరు నారాయ‌ణ‌స్వామి వైఎస్ జ‌గ‌న్ మొద‌టి మంత్రివర్గ విస్త‌ర‌ణ‌లో డిప్యూటీ సీఎంగా చాన్సు కొట్టేశారు. కీల‌క‌మైన ఎక్సైజ్ శాఖ‌, వాణిజ్య ప‌న్నుల శాఖ‌ల‌ను ద‌క్కించుకున్నారు. అంతేకాకుండా జ‌గ‌న్ రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లోనూ చాన్సు ద‌క్కించుకున్న నేత‌ల్లో ఒక‌రిగా నిలిచారు. రెండో విడ‌త‌లోనూ డిప్యూటీ సీఎంగా అవ‌కాశం ద‌క్కించుకోవ‌డంతోపాటు కీల‌క‌మైన ఎక్సైజ్ శాఖ‌ను నిల‌బెట్టుకున్నారు. 70 ఏళ్ల‌కు పైబ‌డి వ‌యసున్న నారాయ‌ణ‌స్వామి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్‌కు సాష్టాంగ న‌మ‌స్కారం చేయ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.

నారాయ‌ణ‌స్వామికి వ‌య‌సు పైబ‌డిన నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న కుమార్తె గంగాధ‌ర నెల్లూరు నుంచి పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని వార్తలు వ‌చ్చాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.