Begin typing your search above and press return to search.

ఒక డీటీసీ నెల ఆదాయం రూ.3కోట్లా?

By:  Tupaki Desk   |   30 April 2016 7:07 AM GMT
ఒక డీటీసీ నెల ఆదాయం రూ.3కోట్లా?
X
నిజమే.. తాజా ఉదంతం వింటే నోరు వెళ్లబెట్టాల్సిందే. సర్కారీ ఆఫీసుల్లో అవినీతి మామూలే కానీ.. ఆ అవినీతిని లెక్క కడితే అదే స్థాయిలో ఉంటుందన్న విషయం తూర్పుగోదావరి జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్.. ఇంకా సింఫుల్ గా చెప్పాలంటే డీటీసీగా విధులు నిర్వర్తించే ఆదిమూలం మోహన్ ఆస్తుల చిట్టా.. అతగాడి నెలసరి ఆదాయం లెక్కలు వింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావటం ఖాయం. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా చెప్పే ఇతగాడి మీద కన్నేసిన ఏసీబీ అధికారులు నిర్వర్తిస్తున్న సోదాల్లో బయటకు వస్తున్న సమాచారాన్ని చూసి ఏసీబీ అధికారులే నోరు వెళ్లబెట్టే పరిస్థితి. ఒక మామూలు స్థాయి ఉద్యోగికి ఇంత భారీ స్థాయిలో ఆస్తులా అని అవాక్కవుతున్నారు.

కేరాఫ్ కాకినాడ అయినా.. అయ్యగారి ఆస్తులు మాత్రం ఏపీ.. తెలంగాణ.. కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. గురువారం ఉదయం ఈ మూడు రాష్ట్రాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో ఏక సమయంలో తనిఖీలు చేపట్టిన సందర్భంగా.. మోహన్ ఆస్తుల వివరాలువందల కోట్లు ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మోహన్ కు హైదరాబాద్ లో ఉన్న ఆస్తుల విలువే రూ.100కోట్లుగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఆయన ఆస్తులకు సంబంధించిన సమాచారం నేపథ్యంలో చిత్తూరు.. నెల్లూరు... అనంతపురం.. కడప.. విజయవాడ.. ప్రొద్దుటూరు.. కాకినాడ.. బళ్లారిలలో కుప్పలు తెప్పలుగా ఆస్తులు ఉన్నట్లు చెబుతున్నారు.

ఇతగాడి అవినీతి డైలీ బేసిస్ లో ఉంటుందని చెబుతున్నారు. కాకినాడ పోర్టుకు వెళ్లే ప్రతి లారీ నుంచి రవాణా శాఖా అధికారులు వెయ్యి తక్కువ కాకుండా వసూలు చేస్తారని.. ఫిట్ నెస్ సర్టిఫికేట్ లేని లారీ దగ్గర మరింత అదనంగా ఛార్జీలు వసూలు చేస్తారని చెబుతున్నారు. ఇలా లారీల నుంచి వసూలు చేసే మొత్తమే రోజుకు రూ.10లక్షల వరకూ ఉంటుందని.. నెలకు రూ.3కోట్లకు తక్కువ కాకుండా ఆదాయం ఉంటుందని చెబుతున్నారు. మరి అన్నేసి కోట్ల ఆదాయం వస్తే.. వందల కోట్లు ఆస్తులు కుప్పేయకుండా ఎందుకుంటారు చెప్పండి?