Begin typing your search above and press return to search.

జెడ్ ప్ల‌స్‌ తో కోర్టుకు వ‌చ్చి.. జైల్లో ఇలా!

By:  Tupaki Desk   |   27 Aug 2017 4:13 AM GMT
జెడ్ ప్ల‌స్‌ తో కోర్టుకు వ‌చ్చి.. జైల్లో ఇలా!
X
దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన డేరా బాబా వ్య‌వ‌హారానికి సంబంధించిన స‌రికొత్త విష‌యాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. పండ‌గ‌పూట డేరా బాబా పుణ్య‌మా అని భ‌గ్గుమ‌న్న రెండు రాష్ట్రాల్లో హింస తీవ్ర‌త ఎంత‌న్న‌ది కాస్తా ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని చెప్పాలి. హింస విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. తీవ్ర‌మైన నేరారోప‌ణ‌లున్న డేరా బాబా కోర్టుకు వ‌చ్చిన వైభోగం గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.

త‌న ద‌గ్గ‌ర ప‌ని చేసిన ఇద్ద‌రు యువ‌తుల్ని అత్యాచారం చేసిన నేరారోప‌ణ‌కు సంబంధించి తీర్పు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం పంచ‌కుల సీబీఐ కోర్టు ఇవ్వాల్సి ఉంది. దీనికి హాజ‌రయ్యేందుకు డేరా బాబా చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. కోర్టుకు హాజ‌ర‌య్యేందుకు శుక్ర‌వారం తొమ్మిది గంట‌ల వేళ‌లో సిర్సాలోని డేరా స‌చ్చా సౌధా ప్ర‌ధాన కేంద్రం నుంచి బ‌య‌లుదేరాడు బాబా. భారీ కార్ల కాన్వాయ్‌ (200 కార్ల కాన్వాయ్‌).. జడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త‌.. మ‌రోవైపు ప్రైవేటు సైన్యం.. వేలాదిగా అభిమానుల‌తో బ‌య‌లుదేరాడు.

సిర్సా నుంచి దాదాపు 260 కిలోమీట‌ర్ల దూరంలో పంచ‌కుల సీబీఐ కోర్టు ఉంది. ఇంత దూరం తన భారీ కాన్వాయ్ తో హ‌డావుడి చేశాడు బాబా. దారి పొడువునా ఆయ‌న అభిమానులు ఆయ‌న కాన్వాయ్‌ ను అడ్డుకుంటూ కోర్టుకు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్ప‌టం క‌నిపించింది. వారిని వారిస్తూ.. బాబా మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వేళ‌కు వేలాది మంది తోడు రాగా పంచ‌కుల సీబీఐ కోర్టు ప్రాంగ‌ణానికి చేరుకున్నారు.

అత్యాచారం ఆరోప‌ణ‌ల కేసులో దోషిగా నిరూపిత‌మైన బాబాను పంచ‌కులలోని ఆర్మీ అతిథి గృహానికి త‌ర‌లించారు. అక్క‌డ నుంచి ఆర్మీ హెలికాఫ్ట‌ర్ లో రోహ‌త‌క్ జైలుకు త‌ర‌లించారు. బాబా వెంట ఆయ‌న కుమార్తె హ‌నీప్రీత్ కూడా రోహ్ త‌క్ కు వెళ్లారు. అక్క‌డ పోలీసు అతిధి గృహంలో ఫైవ‌ర్‌స్టార్ సౌక‌ర్యాల్ని క‌ల్పించారు. ఆయ‌న‌కు అందిన సేవ‌ల‌పై మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లు రావ‌టంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో శుక్ర‌వారం రాత్రి 9.30 గంట‌ల‌కు ఆయ‌న్ను రోహ‌త‌క్ జైలుకు త‌ర‌లించారు.

జైలుకు వెళ్ల‌టానికి ముందు బాబాకు సేవ‌ల్లో త‌రించిన అధికారులు విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నప్ప‌టికీ.. జైలు సిబ్బంది కూడా త‌న తీరును మార్చుకోలేదు. జైల్లోనూ బాబాకు స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పించ‌టం గ‌మ‌నార్హం. మిన‌ర‌ల్ వాట‌ర్ బాటిళ్ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌టంతో పాటు.. ఏసీ సౌక‌ర్యం.. ప‌రుపుతో పాటు ఒక స‌హాయ‌కుడ్ని కూడా ఏర్పాటు చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. దీంతో.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌టంతో తాము అలాంటి సేవ‌ల్ని బాబాకు క‌ల్పించ‌లేదంటూ అధికారులు చెప్పుకోవ‌టం క‌నిపించింది. మిగిలిన ఖైదీల మాదిరే చూస్తున్న‌ట్లుగా హ‌ర్యానా జైళ్ల డీజీపీ కేపీ సింగ్ వివ‌ర‌ణ ఇచ్చారు.

శుక్ర‌వారం రాత్రి జైలుకు వెళ్లిన గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్‌కు ఖైదీగా 1997 నెంబ‌రును కేటాయించారు. శ‌నివారంఉద‌యం జైల్లో యోగాతో త‌న దిన‌చ‌ర్య‌ను స్టార్ట్ చేసిన‌ట్లుగా అధికారులు చెబుతున్నారు. ఆ త‌ర్వాత రెండు బ్రెడ్డు ముక్క‌లు తిని.. టీ తాగార‌ని చెప్పారు. శుక్ర‌వారం రాత్రి జైలుకు చేరుకున్న అనంత‌రం.. నిద్ర‌పోలేద‌ని.. మెలుకువ‌గా ఉన్నార‌ని.. గ‌దిలో అటూఇటు తిరుగుతూ ఉన్న‌ట్లుగా జైలు సిబ్బంది చెబుతున్నారు.

పంచ‌కుల సీబీఐ కోర్టు ఆయ‌న్ను దోషిగా నిర్దారించిన అనంత‌రం ఆయ‌న‌కు ఉన్న జడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త‌ను తొల‌గించిన‌ట్లుగా అధికారులు వెల్ల‌డించారు. శుక్ర‌వారం కోర్టు తీర్పు వెలువ‌డిన అనంత‌రం.. వెంట‌నే గుర్మిత్‌ కు జ‌డ్ ప్ల‌స్ భ‌ద్ర‌త‌ను తొలగించట‌మే కాదు.. జైల్లోనూ సాధార‌ణ ఖైదీలా చూస్తున్నామ‌ని.. మిగిలిన ఖైదీల మాదిరే భోజ‌నాన్ని అందిస్తున్న‌ట్లు చెబుతున్నారు. అయితే.. జైలు లోప‌ల ఎలాంటి ప‌రిస్థితులు ఉన్నాయ‌న్న దానిపై ప‌లువురు సందేహాలు వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.