Begin typing your search above and press return to search.

హత్య కేసులో డేరాబాబాకు జీవిత ఖైదు .. రూ. 31 లక్షల జరిమానా

By:  Tupaki Desk   |   18 Oct 2021 2:30 PM GMT
హత్య కేసులో డేరాబాబాకు జీవిత ఖైదు .. రూ. 31 లక్షల జరిమానా
X
రంజిత్‌ సింగ్‌ హత్య కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సధా నిర్వాహకుడు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ అలియాస్ డేరా బాబాకు పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది. డేరా బాబా ఆశ్రమంలో మేనేజర్‌గా పనిచేసిన రంజిత్ సింగ్ హత్య కేసులో డేరాబాబాతోపాటు మరో నలుగురికి జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. డేరాబాబాకు జీవిత ఖైదుతోపాటు రూ. 31 లక్షల జరిమానా విధించగా.. మిగతా నిందితులకు రూ. 50 వేల చొప్పున జరిమానా విధించింది.

కాగా డేరా సచ్చా సౌదాలోనే రంజిత్ సింగ్ 2002 జులై 10న హత్యకు గురవ్వగా.. ఈ హత్య కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం డేరా బాబాను దోషిగా నిర్ధారించింది.  గుర్మీత్ రామ్ రహీమ్‌తో పాటు మరో నలుగురిని దోషులుగా తేల్చింది. రంజిత్ హత్యకు డేరా బాబా సహా జస్బీర్ సింగ్, సబ్దీల్ సింగ్, కృష్ణ లాల్, ఇందర్ సైన్‌లు కుట్ర పన్నినట్టు నిర్ధారించింది. అక్టోబర్ 12 న పంచకులంలోని సీబీఐ కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. సీబీఐ వాదనలు పూర్తిగా చదవడానికి దోషుల న్యాయవాదులు సమయం కోరిన తర్వాత సీబీఐ న్యాయమూర్తి సుశీల్ గార్గ్ అక్టోబర్ 18 తేదీని ఇచ్చారు.

మరోవైపు, సోమవారం రంజిత్ హత్య కేసులో తీర్పు కారణంగా, పంచకుల జిల్లా యంత్రాంగం ఉదయం నుంచే నగరంలో మొత్తం 144 సెక్షన్ విధించింది. పంచకుల వ్యాప్తంగా ఐటీబీపీ(ITBP) సిబ్బందితో పాటు పోలీసులను మోహరించారు. నగరానికి వచ్చే ప్రజలను క్షుణ్ణంగా శోధించిన తర్వాత మాత్రమే ముందుకు సాగడానికి అనుమతించారు. రంజిత్ సింగ్ హత్య కేసులో ముగ్గురి వాంగ్మూలం కీలకంగా మారింది. వీరిలో ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు సుఖ్‌ దేవ్ సింగ్, జోగిందర్ సింగ్ నిందితులు రంజిత్ సింగ్‌ పై కాల్పులు జరిపినట్లు తాము చూశామని కోర్టుకు తెలిపారు.

మూడో సాక్షి డేరాముఖి డ్రైవర్ ఖట్టా సింగ్. ఖట్టా సింగ్ చెప్పిన దాని ప్రకారం, అతని సమక్షంలోనే రంజిత్ సింగ్‌ ను చంపడానికి కుట్ర జరిగింది. తన ముందు రంజిత్ సింగ్‌ ను చంపాలని డేరాముఖి రామ్ రహీమ్ కోరినట్లు ఖట్టా సింగ్ తన ప్రకటనలో తెలిపారు. కేసు ప్రారంభ విచారణ సమయంలో, ఖట్టా సింగ్ కోర్టులో ఈ ప్రకటనను ఉపసంహరించుకున్నాడు. కానీ, చాలా సంవత్సరాల తర్వాత అతను మళ్లీ కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పాడు. అతని వాంగ్మూలం ఆధారంగా ఐదుగురిని దోషులుగా నిర్ధారించారు. ఇద్దరు డేరా సాధ్వీల లైంగిక వేధింపుల కేసులో ఆగష్టు 28, 2017 న 20 సంవత్సరాల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే.