Begin typing your search above and press return to search.

వెంకయ్యకు భిన్నమైన వీడ్కోలు పలికిన తృణమూల్‌ ఎంపీ

By:  Tupaki Desk   |   9 Aug 2022 4:28 AM GMT
వెంకయ్యకు భిన్నమైన వీడ్కోలు పలికిన తృణమూల్‌ ఎంపీ
X
ఎట్టకేలకు వాజ్ పేయ్.. అద్వానీ జమానాకు చెందిన మరో కీలక నేత కీలక పదవి నుంచి తప్పుకున్నారు. ఉప రాష్ట్రపతి హోదాలో తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న ఈ బీజేపీ సీనియర్ నేత సోమవారం సభలో తన చివరి రోజును గడిపారు.

ఈ సందర్భంగా సభ ఆయనకు పెద్ద ఎత్తున వీడ్కోలు పలికింది. మిగిలిన రాజ్యసభ సభ్యులకు భిన్నంగా తృణమూల్‌ కాంగ్రెస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు డెరెక్ ఓబ్రెయిన్ వ్యవహరించారు. పలు ప్రశ్నలు సంధించి.. వాటికి సంబంధించిన సమాధానాల్ని తన ఆత్మకథలో అయినా ప్రస్తావించాలని వెంకయ్యకు సూచన చేశారు.

కేంద్రం ఆ మధ్యన వెనక్కు తీసుకున్న వివాదాస్పద వ్యవసాయ చట్టాలను 2020 సెప్టెంబరు 20న ఎగువ సభ ఆమోదం పలికిన సమయంలో రాజ్యసభ ఛైర్మన్ స్థానంలో వెంకయ్య లేరన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. దీనికి సంబంధించిన సమాధానాన్ని ఏదో ఒక రోజు ఆత్మకథలో సమాధానం ఇస్తారని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

అంతేకాదు.. బీజేపీ ప్రతిపక్ష నేతగా ఉన్న వేళలో 2013 సెప్టెంబరు 2న పెట్రోల్.. డీజిల్ ధరల పెరుగుదలపై వెంకయ్య చేసిన ఉద్వేగభరిత ప్రసంగాన్ని ప్రస్తావించి.. దీనికి కూడా ఆత్మకథలో సమాధానం ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

మరో కీలక అంశాన్ని ప్రస్తావించటం ద్వారా తృణమూల్‌ ఎంపీ చిక్కు ప్రశ్నలతో వెంకయ్యకు వీడ్కోలు పలికారని చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ వివాదానికి సంబంధించి 2013లో రాజ్యసభలో మాట్లాడిన వెంకయ్య.. రాజ్యసభకు ఛైర్మన్ గా వ్యవహరించిన వేళలో మాత్రం పెగాసన్ వివాదానికి సంబంధించిన చర్చకు మాత్రం ఛాన్స్ ఇవ్వకపోయిన వైనాన్ని గుర్తు చేయటం గమనార్హం. 2013 మార్చి ఒకటిన మీరు (అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నారు వెంకయ్య) ఐదారు నిమిషాల పాటు ఫోన్ ట్యాపింగ్ మీద జోక్యం చేసుకున్నారు.

కానీ.. కొన్నేళ్లుగా పెగాసస్ అంశాన్ని సభలో చర్చించటానికి మాత్రం మేం చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదని పేర్కొనటం విశేషం. మొత్తానికి మిగిలిన వారికి భిన్నమైన రీతిలో తృణమూల్‌ కాంగ్రెస్ ఎంపీ చిక్కు ప్రశ్నలు వెంకయ్యకు మర్చిపోలేని అనుభవాన్ని మిగిల్చేలా చేశారని చెప్పక తప్పదు.