Begin typing your search above and press return to search.

ట్రంప్ వ‌ల‌స‌ల జీవో పూర్తి బ్యాన్

By:  Tupaki Desk   |   31 March 2017 6:29 AM GMT
ట్రంప్ వ‌ల‌స‌ల జీవో పూర్తి బ్యాన్
X
తాను ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న‌ట్లుగా వ్య‌వ‌హరిస్తున్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు దిమ్మ‌తిరిగే పోయే షాక్‌. ఆరు ముస్లిం దేశాల నుంచి ప్రజలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల జారీ చేసిన సవరించిన ఆదేశాలను హవాయిలోని అమెరికా ఫెడరల్ జడ్జి శాశ్వతంగా నిలిపివేశారు. ట్రంప్ జారీ చేసిన ఈ కార్యనిర్వాహక ఆదేశం అమలు కాకుండా మార్చి 15న తాత్కాలికంగా నిలిపివేస్తూ తీర్పు చెప్పిన అమెరికా జిల్లా జడ్జి డెర్రిక్ వాట్సన్.. తాజాగా శాశ్వతంగా నిలిపివేస్తూ తీర్పు ఇచ్చారు. తాత్కాలిక నిలుపుదల ఆదేశాలను దీర్ఘకాలం పాటు అమలులో ఉండేలా ఆదేశించాలని కోరుతూ పిటిషన్‌దారులు చేసిన అభ్యర్థనను అంగీకరించిన జడ్జి వాట్సన్ తాజా తీర్పు వెలువరించారు.

ఆరు ముస్లిం దేశాల నుంచి ఉగ్రవాదులు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించే ఉద్దేశంతో ట్రంప్ ఈ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజా తీర్పు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురు దెబ్బేన‌ని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒక‌వేళ ఉన్నత న్యాయస్థానం ఏదైనా వాట్సన్ తీర్పును నిలిపివేస్తే తప్ప.. ట్రంప్ విధించిన ఆరు ముస్లిం దేశాల నుంచి విదేశీయులు అమెరికాలోకి ప్రవేశించకుండా 90 రోజుల నిషేధం, శరణార్థులు ఎవరూ అమెరికాలోకి ప్రవేశించకుండా 120 రోజుల నిషేధం నిలిచిపోయినట్టే. అంటే గతంలో వలెనే ఎవరైనా అమెరికాలోకి ప్రవేశించొచ్చు. ట్రంప్ జారీ చేసిన తాజా ఆదేశాలు ముస్లింల పట్ల వివక్షను ప్రదర్శిస్తూ అమెరికా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని వాట్సన్ పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/