Begin typing your search above and press return to search.

బాలిలో మనసు విప్పి మాట్లాడుకోవాలి!

By:  Tupaki Desk   |   9 Aug 2022 11:30 PM GMT
బాలిలో మనసు విప్పి మాట్లాడుకోవాలి!
X
ఇప్పుడంతా హైటెక్ యుగం.. అందులోనూ ఏం మాట్లాడినా బయటకు వెళ్లిపోతుంది. ఎక్కడకు వెళ్లి మాట్లాడుకుందామన్నా నిఘా కళ్లు వెంటాడుతాయి. ఇక రాజకీయ నాయకులు అందులోనూ అధికార పార్టీ వారి గురించి అయితే చెప్పేదేముంది? వారి కదలికలను అను నిత్యం నాలుగు కళ్లు వెంటాడుతుంటాయి. ప్రాంతీయ పార్టీల్లో అయితే ఈ నిఘా మరింత ఎక్కువ.ఎక్కడ ఎప్పుడు ఎవరు ఎలా కలిశారు? అనే వివరాలు అధినేతకు వెళ్లిపోతుంటాయి. అందుకే నాయకులు అత్యంత అప్రమత్తంగా ఉంటారు. ఎవరినీ ఒక పట్టాన నమ్మరు. తమ కళ్లతో చూసిందో, తాము నమ్మిందో అయితేనే వెళ్లిపోతుంటారు.

ఏదైనా చెప్పాలన్నా చెవిలోనే..ఫోన్ మాట్లాడినా ట్యాపింగ్ లో దొరికిపోయే ప్రమాదం ఉంది. అందుకనే ఏం చెప్పాలన్నా నోటితోనే చెప్పుకొనే పరిస్థితి. అది కూడా నిఘాకు దొరకకుండా.. తెలంగాణలోనూ ప్రస్తుతం కొందరు నాయకులు ఇదే ఆలోచనలో ఉన్నారు. మనసు విప్పి మాట్లాడుకోవాలని ఛలో బాలి అంటున్నారు. బాలి అంటే.. ఇండోనేసియాలోని ఓ ద్వీపం. పర్యాటకానికి పేరుగాంచిన ద్వీపంలో జరిగే ఓ డెస్టినేషన్ వెడ్డింగ్ వీరి సంభాషణలకు వేదిక కానుంది. అంటే.. డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో డెస్టినేషన్ పాలిటిక్స్ అన్నమాట.

వియ్యమందుతున్న మాజీ ఎంపీలు తెలంగాణకు చెందిన ఇద్దరు మాజీ ఎంపీల కుటుంబాలు త్వరలో వియ్యం అందనున్నాయి. మాజీ ఎంపీ కుమార్తెకు, మరో మాజీ ఎంపీ మనవడితో ఈ నెలలో వివాహం జరగనుంది. ఆర్థికంగా, వనరుల పరంగా బలమైన ఈ కుటుంబాల వారు బాలిలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌గా జరిపిస్తున్నారు. పరిమిత అతిథులు, ప్రత్యేక విమానాలు, అదిరిపోయే ఏర్పాట్లతో ప్లాన్‌ చేసుకున్నారు. తెలంగాణకు చెందిన పలువురు నేతలు ఇతర దేశంలో కలుసుకోనున్నారు. వీరు వెళ్లేది 'డెస్టినేషన్‌ వెడ్డింగ్‌'కే అయినా.. రాజకీయ చర్చలకు ఆస్కారముంది. పెళ్లికి ఆహ్వానం అందిన కొందరు నేతలు మనసు విప్పి మాట్లాడుకునేందుకు చలో బాలి అంటున్నారు.

ఇద్దరు బీజేపీ కీలక నేతలు సహా..కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ మధ్య తెలంగాణలో ప్రస్తుతం రాజకీయం రసకందాయంగా ఉంది. క్షేత్ర స్థాయిలో బలం లేకున్నా, నాయకులు లేకున్నా బీజేపీ సై అంటోంది. ఈ రెండూ ఉన్న కాంగ్రెస్.. అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కొనడంలో ఆపసోపాలు పడుతోంది. ఇక్కడ విషయమేమంటే.. బాలి పెళ్లికి ఇద్దరు బీజేపీ కీలక నేతలూ హాజరవనున్నారు. మిగతా రెండు పార్టీల నేతలు, ఎమ్మెల్యేలూ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వీరందరి మధ్య రాజకీయ చర్చలకు అవకాశం ఉండడం ఖాయం.

ఏం ఇక్కడైతే ఏమవుతుంది?రెండేళ్ల కిందట తెలంగాణకు చెందిన కొందరు నేతలు ఓ పొరుగు రాష్ట్రంలో మాట్లాడుకున్న మాటలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. కానీ, ఈ వివరాలు బయటకు పొక్కాయి. కీలక నేతను బయటకు పంపేందుక ఇవే కారణమయ్యాయి. ఇవే ఓ ఉప ఎన్నికకు, ఇతర రాజకీయ పరిణామలకు దారితీశాయి. దీన్నిబట్టే రాష్ట్రంలో నిఘా ఏమేరకు ఉందో తెలుసుకోవచ్చు. అందుకనే నేతలు ఫోన్ సంభాషణలు, కదలికల్లో అత్యంత జాగ్రత్తగా ఉంటున్నారు. ఏ ఇద్దరు నేతలు కలుసుకున్నా.. ఎందుకు కలిశారా? అంటూ ఆరా తీస్తారు.

పార్టీల మార్పు, అంచనాలు చెప్పుకోవడం, అభిప్రాయాల మార్పిడి.. ఇలా ఏదైనా రాష్ట్రంలోనైతే స్వేచ్ఛగా చేసుకోవడానికి వీల్లేదనే ఆందోళన పలువురిలో నెలకొంది. దీంతో స్వేచ్ఛగా కలుసుకోవడం, మాట్లాడుకోవడం వీలుకావడం లేదన్న భావన నేతల్లో ఉంది. ఇది అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఉందన్నది బహిరంగ రహస్యమే. తమను నిఘా నీడ అనుసరిస్తోందనే అనుమానం బలంగా పాతుకుపోయింది. ఈ నేపథ్యంలో నిఘా నీడకు ఆవల, ఫోన్లతో సంబంధం లేకుండా, నేరుగా కలిసి మాట్లాడుకునేందుకు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అవకాశం కల్పిస్తుందని వారు భావిస్తున్నారు. పెళ్లి పేరుతో సుదూరానికి వెళితే అక్కడ రాజకీయ దూరాలు చెరిపేసుకోవడం, రాజకీయ రహస్యాలు మాట్లాడుకోవడం సులభమవుతుందన్న భావనలో ఉన్నారు. రాష్ట్రంలో మాట్లాడుకోలేని అనేక విషయాలను స్వేచ్ఛగా పంచుకోవచ్చనే అభిప్రాయం ఉంది.

మోదీ బాబు కలయికా..?తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. నాలుగున్నరేళ్ల తర్వాత మోదీ-బాబు కలయిక జరిగింది. ఈ మధ్యలో ఎన్నో పరిణామాలు జరిగాయి. మోదీతో తీవ్రంగా విభేదించి ఎన్నికలకు పోయిన చంద్రబాబు దారుణంగా దెబ్బతిన్నారు. వైసీపీ వచ్చాక టీడీపీకి, చంద్రబాబుకు కష్టాలు మరింత పెరిగాయి. మరోవైపు చంద్రబాబుకు మోదీ అప్పాయింటే కష్టంగా మారింది. అయితే, అనూహ్యంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మోదీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి చంద్రబాబుకు పిలుపొచ్చింది. ఇది కూడా ఓ డెస్టినేషన్‌ ప్రోగామ్‌ కిందకే వస్తుందన్న అభిప్రాయం ఉంది. మోదీతో చంద్రబాబుకు ఈ సందర్భంలోనే మాట కలిసింది. మీతో చాలా మాట్లాడాలని ప్రధాని, మీకు చాలా చెప్పాలని చంద్రబాబు అనుకోవడం.. చివరకు అది మరో సమావేశానికి పిలుస్తాను, మాట్లాడదాం అని మోదీ అనేంతవరకు వెళ్లింది.