Begin typing your search above and press return to search.

కుప్పంలో విగ్రహాల ధ్వంసం .. చంద్రబాబు పై ఎస్పీ ఫైర్, ఎందుకంటే !

By:  Tupaki Desk   |   7 April 2021 9:33 AM GMT
కుప్పంలో  విగ్రహాల ధ్వంసం .. చంద్రబాబు పై ఎస్పీ ఫైర్, ఎందుకంటే !
X
చిత్తూరు జిల్లాలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసం తీవ్ర కలకలం రేపింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం బిరుదన్నపల్లి గ్రామంలో బేటగుట్టపై ఉన్న సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలోని విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దేవతామూర్తుల విగ్రహాలను విరగ్గొట్టి ఆలయం బయట పడేశారు. సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయంపై దుండుగలు దాడి చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన పై విచారణ వేగవంతం చేసిన పోలీసులు సంఘటన జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించారు. మతిస్థిమితం లేని ఓ మహిళ విగ్రహాలు ధ్వంసం చేసిందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించారు.

ఆ ఆలయం చాలా మారుమూల ప్రాంతంలో ఉందని, వారానికి ఒకసారి మాత్రమే అక్కడ పూజలు జరుగుతాయని తెలిపారు. మతిస్థిమితం లేని మహిళ ఈ ఘటనకు కారణమని వెల్లడైంది అని అన్నారు. విగ్రహాల ధ్వంసం చేసిన విషయాన్ని జ్యోతి అనే మహిళ ఒప్పుకుందని అన్నారు. విగ్రహాలు ధ్వంసం చేసే సమయంలో మహిళ మద్యం మత్తులో ఉందని, జిల్లాలోని అన్ని ప్రార్థనాలయాలకు జియో ట్యాగింగ్ చేశామని, ఈ ఘటనపై కుట్ర జరిగిందనేలా చంద్రబాబు ట్వీట్ చేయడం సరికాదు అని అన్నారు. ఓ ఘటన జరిగిన వెంటనే దానిపై నిజానిజాలు తెలుసుకోకుండానే వ్యాఖ్యలు చేయడం సరికాదు అని , ఆ ఘటన పై నిజానిజాలు నిర్ధారించుకుని వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయకూడదని హితవు పలికారు. తప్పుడు ప్రచారం చేస్తే చట్టరీత్యా కేసులు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే, పోలీసులు, పీస్‌ కమిటీకి వెంటనే తెలియజేయాలని చెప్పారు.

ఇంతకీ చంద్రబాబు ఈ ఘటన పై ఎలా రియాక్ట్ అయ్యారంటే .. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసం ఘటనపై చంద్రబాబు ట్విట్టర్‌ లో స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత, నిర్లక్ష్యం వల్లే విగ్రహాల ధ్వంసం, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. బేటగుట్టపై శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోని విగ్రహాల ధ్వంసం అత్యంత బాధాకరమన్నారు. ఒకటా, రెండా వందల కొద్దీ ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా విగ్రహాల ధ్వంసంపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో చోటు చేసుకున్న విగ్రహాల ధ్వంసం ఘటలన్నింటిలో నిందితులను అరెస్ట్ చేయాలన్నారు.