Begin typing your search above and press return to search.

ఆర్టికల్ 370పై నిజమేది.. అసత్యమేది?

By:  Tupaki Desk   |   6 Aug 2019 1:30 AM GMT
ఆర్టికల్ 370పై నిజమేది.. అసత్యమేది?
X
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి దఖలు పరిచిన ఆర్టికల్ 370 రద్దుకు కేంద్రం సిఫారసు చేసింది. ఈ సందర్భంగా ఆ ఆర్టికల్ గురించి ఎన్నో అంశాలు ప్రచారంలోకి వస్తున్నాయి. వీటిలో వాస్తవాలతో పాటు అవాస్తవాలు.. అవగాహన రాహిత్యపు సిద్దాంతాలు - అర్థసత్యాలు - వక్రభాష్యాలు అన్నీ ప్రచారమవుతున్నాయి.

* 370వ అధికరణ కింద కశ్మీరులో ఇతరులెవరూ భూములు కొనడానికి వీల్లేదు. కశ్మీర్‌ రాష్ట్రానికి చెందిన మహిళలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని చేసుకుంటే వారు కశ్మీర్‌లో భూమి హక్కులను కోల్పోతారు.

- కశ్మీర్‌లో భూములను ఇతరులు కొనరాదనే నిబంధన 370వ అధికరణం నుంచి రాలేదు. 1846, మార్చి 16వ తేదీన బ్రిటీష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీతో డోగ్రా రాజ్‌పుత్‌లు చేసుకున్న ‘అమత్సర్‌ ఒప్పందం’ ద్వారా అమల్లోకి వచ్చింది. జమ్ము రాజు గులాబ్‌ సింగ్‌ మధ్యవర్తిత్వంలో డోగ్రాలు కశ్మీర్‌ ప్రాంతాన్ని కొనుగోలు చేసినప్పుడు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇలాంటి ఒప్పందాలు హిమాచల్‌ ప్రదేశ్ - అరుణాచల్‌ ప్రదేశ్ - నాగాలాండ్ - అండమాన్ నికోబార్‌ దీవుల్లో కూడా ఉన్నాయి.

- కశ్మీర్‌ రాష్ట్రానికి చెందిన మహిళలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని పెళ్లి చేసుకుంటే వారు స్థానిక భూమి హక్కులు కోల్పోతారనడం అబద్ధమని, అలాంటి నిబంధనలు ఎక్కడా లేవని 2000 సంవత్సరంలో కశ్మీర్‌ హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది.

- రాజ్యాంగ నిపుణుడు, చరిత్రకారుడు ఏజీ నూరాని రాసిన ‘ఆర్టికల్‌ 370: ఏ కానిస్టిటూషనల్‌ హిస్టరీ ఆఫ్‌ జమ్మూ అండ్‌ కశ్మీర్’ ప్రకారం ప్రముఖ కశ్మీరీ నాయకుడు షేక్‌ మొహమ్మద్‌ అబ్దుల్లా అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూతో జరిపిన చర్చల మేరకు నాడు కశ్మీర్‌ పాలకుడు హరిసింగ్‌ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయడానికి 1947, అక్టోబర్‌ నెలలో అంగీకారానికి వచ్చారు. ఆ ఒప్పందంలో భాగంగా రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ల రంగాల్లో కశ్మీర్‌కు సహరించేందుకు భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది. హరిసింగ్‌ డిమాండ్‌ మేరకు మిగతా వ్యవహారాల్లో కశ్మీర్‌కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేందుకు అంగీకరించింది.

ఈ అధికరణ వల్ల మూడు రంగాల్లో మినహా అన్ని రంగాల్లో కశ్మీరుకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుందనే అభిప్రాయం ఏర్పడింది. ఈ అధికరణ భారత్‌ నుంచి కశ్మీర్‌ను వేరు చేస్తోందని, కశ్మీర్‌ అభివద్దికి అడ్డుగోడలా తయారైందనే వాదనలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు 370 అధికరణం రద్దు చేసుకోవడం భారత్‌కే నష్టమని, కశ్మీర్‌పై నున్న కొన్ని హక్కులను కూడా కోల్పోవడమేనని ప్రముఖ కశ్మీర్‌ ఆర్థికవేత్త డాక్టర్‌ హసీబ్‌ ద్రాబు వ్యాఖ్యానించారు. 370వ అధికరణను రద్దు చేయడం ద్వారా ఇక ఇప్పుడు భారత సైన్యం దురాక్రమణలో కశ్మీర్‌ ఉన్నట్లని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ సలహాదారు రాణా జితేంద్ర సింగ్‌ అభిప్రాయపడ్డారు.