Begin typing your search above and press return to search.

శ్రామిక్ రైళ్లలో టికెట్ ఎంత? ఇంతకూ ఎవరు భరిస్తున్నారు?

By:  Tupaki Desk   |   2 May 2020 6:00 AM GMT
శ్రామిక్ రైళ్లలో టికెట్ ఎంత? ఇంతకూ ఎవరు భరిస్తున్నారు?
X
రోజుల తరబడి ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ వేళ.. వలస కూలీలు..కార్మికులు.. యాత్రికులు.. విద్యార్థులు.. ఇలా ఎందరో ఎక్కడెక్కడో ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. తొలుత 21 రోజులుగా నిర్ణయించిన లాక్ డౌన్ ను పొడిగించటం.. ముచ్చటగా మూడోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఇలా వారాల తరబడి తమ నివాసాలకు దూరంగా ఉంటున్న వారు పడుతున్న అవస్థలు అన్ని ఇన్నికావు.

లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వారిని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు కేంద్రం రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా పదుల సంఖ్యలో రైళ్లను నడపాలని.. వాటికి శ్రామిక్ రైళ్లు అన్న పేరుతో నడుపుతున్నారు. మరి.. ఇలాంటి రైళ్లలో ఎలా ప్రయాణించాలి? వాటిలో ప్రయాణం చేయాలంటే ఎవరి పర్మిషన్ కావాలి? ప్రత్యేకంగా టికెట్లు ఇస్తారా? ఇంతకీ ఈ రైళ్లలో ఛార్జీలు ఎంత? రైల్వే స్టేషన్లకు ఎలా చేరుకోవాలి? ఏ ప్రాంతానికి వెళ్లే రైలు ఎప్పుడు వెళుతుందన్న విషయం ఎలా తెలుస్తుందన్న ప్రశ్నలకు సమాదానం లభించని పరిస్థితి.

తాజాగా ఈ ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాలు లభించాయి. అవేమంటే..
% శ్రామిక్ రైళ్లు ఒక పాయింట్ నుంచి మరో పాయింట్ వరకు మాత్రమే నడుస్తాయి. ఉదాహరణకు సికింద్రాబాద్ లో స్టార్ట్ అయ్యే ట్రైన్ దాని గమ్యస్థానం భువనేశ్వర్ అయితే.. అక్కడి వరకు నడుస్తుంది. అది నాన్ స్టాప్ గా. మధ్యలో మరే స్టేషన్లో ఆగదు. ఒకవేళ దూరప్రయాణమైతే.. మధ్యలో భోజన పాకెట్ల కోసం ట్రైన్ ఆపుతారే తప్పించి.. ఇంకెవరిని ట్రైన్లోకి అనుమతించరు.

% ఈ ట్రైన్లలో ప్రయాణాలకు టికెట్లను జారీ చేయరు. అందుకే.. ఈ రైళ్లలో ప్రయాణానికి ప్రయాణికులు ఎవరూ రైల్వే స్టేషన్లకు రాకూడదు. ఈ రైళ్లలో ప్రయాణించే వారిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ప్రత్యేకంగా గుర్తిస్తాయి. వారిని ఎంపిక చేసిన బస్సుల్లో రైల్వే స్టేషన్ కు తీసుకొస్తారు.

% రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్న వలస కార్మికులు.. పర్యాటకులు.. యాత్రికులు.. విద్యార్థులను మాత్రమే ఈ రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. రైళ్లలో ఎవరిని తీసుకెళ్లాలన్న అధికారం రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. కేంద్రానికి ఇందుకు సంబంధించి ఎలాంటి లింకు ఉండదు. కేంద్రం కేవలం రైళ్లను మాత్రమే నడుపుతుంది. ఆ రైళ్లలో ప్రయాణించే వారెవరన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే డిసైడ్ చేస్తాయి.

% శ్రామిక్ రైళ్లను కేంద్రం ఉచితంగా నడపటం లేదు. వలస కార్మికుల తరఫున ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రైల్వే శాఖకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రాలు డబ్బులు చెల్లించాలన్న దానికి కొన్ని వెనకబడిన రాష్ట్రాలు ఆ ఖర్చుల్ని తాము భరించలేమని చెబుతున్నాయి. జార్ఖండ్ రాష్ట్రాన్నే తీసుకుంటే..ఆ రాష్ట్రానికి చెందిన వారు పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు. వారిని సొంత రాష్ట్రానికి తెప్పించుకోవటానికి అయ్యే ఖర్చు భరించలేమని చెబుతోంది. కాకుంటే.. జార్ఖండ్ వరకూ తమ రాష్ట్ర పౌరుల్ని ఆయా రాష్ట్రాలు పంపితే.. వారిని వారి ఇళ్లకు పంపే బాధ్యతను తాము తీసుకుంటామని చెబుతోంది. మరీ వాదనకు ఆయా రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో తేలాల్సి ఉంది.

% శ్రామిక్ రైళ్ల టికెట్ ఛార్జీల విషయానికి వస్తే.. ఒక్కో ప్రయాణికుడిపై స్లీపర్ క్లాస్ టికెట్ ధరతో పాటు సూపర్ ఫాస్ట్ చార్జీ కింద రూ.30 చొప్పున అదనంగా వసూలు చేస్తారు. భోజనం.. తాగు నీరు కింద రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు స్లీపర్ క్లాస్ టికెట్ రూ.500 అయితే.. పైన రూ.50 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్న మాట.