Begin typing your search above and press return to search.

ఆ న‌లుగురు సుప్రీం జ‌డ్జిల డిటైల్స్ ఇవే!

By:  Tupaki Desk   |   13 Jan 2018 6:04 AM GMT
ఆ న‌లుగురు సుప్రీం జ‌డ్జిల డిటైల్స్ ఇవే!
X
విన్నంత‌నే షాక్ త‌గిలేలా.. నిజ‌మా అన్న సందేహంతో ఒక‌టికి రెండుసార్లు అడిగేలా చోటు చేసుకున్న ఉదంతం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. దేశ చ‌రిత్ర‌లో తొలిసారి సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా తీరును త‌ప్పు ప‌డుతూ మ‌రో న‌లుగురు సుప్రీం న్యాయ‌మూర్తులు మొద‌టిసారి మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌టం తెలిసిందే. ఈ స‌మావేశంలో జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా ప‌ద‌వీ విర‌మ‌ణ‌ త‌ర్వాత ఆ ప‌ద‌విని చేప‌ట్టనున్న జ‌స్టిస్ రంజ‌న్ గొగోయి కూడా విలేక‌రుల స‌మావేశంలో పాల్గొన‌ట‌మే కాదు.. విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స్పందించి స‌మాధానాలు ఇచ్చారు.

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తుల ప్రెస్ మీట్ లో పాల్గొన్న న‌లుగురు సుప్రీం న్యాయ‌మూర్తులు ఎవ‌రు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న విష‌యాలు చూస్తే.. ఆస‌క్తిక‌రంగా ఉంటాయ‌న‌టంలో సందేమం లేదు. దేశానికి చెప్పాల్సింది చెబుతున్నాం. భ‌విష్య‌త్తులో ఏ యువ న్యాయ‌మూర్తి కూడా త‌మ తీరును త‌ప్పు ప‌ట్ట‌కూడ‌ద‌ని.. గ‌తంలో ఇంత జ‌రుగుతున్నా.. మౌనంగా ఉన్నార‌న్న అప‌వాదు ప‌డ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతోనే తాము గ‌ళం విప్పిన‌ట్లుగా న్యాయ‌మూర్తులు పేర్కొన్నారు.

ప్రెస్ మీట్ లో పాల్గొన్న న‌లుగురు సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌మూర్తుల వివ‌రాలు చూస్తే..

జ‌స్టిస్ జాస్తి చ‌ల‌మేశ్వ‌ర్‌

ఒక తెలుగోడు. ఆంధ్ర‌ప్ర‌దేవ్ కృష్ణా జిల్లా మొవ్వ మండ‌లంం పెద్ద ముత్తేవి గ్రామంలో 1953 జూన్ 23న జ‌న్మించారు. తండ్రి మ‌చిలీప‌ట్నంలో (బంద‌ర్‌) న్యాయ‌వాదిగా ప‌ని చేశారు. మ‌చిలీప‌ట్నం హిందూ హైస్కూల్లో స్కూలింగ్‌.. మ‌ద్రాస్ ల‌యోలా కాలేజీలో డిగ్రీ.. విశాఖ‌ప‌ట్నం ఆంధ్రా యూనివ‌ర్సిటీలో లా చ‌దివి ప్ర‌భుత్వ న్యాయ‌వాదిగా ప‌ని చేశారు.

సంచ‌ల‌నం సృష్టించిన ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది వీరింట్లోనే. వీరింటికి వ‌చ్చిన మిగిలిన ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తుల‌తో క‌లిసి విలేక‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

2007లో గౌహ‌తి హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా.. త‌ర్వాత కేర‌ళ హైకోర్టుకు బ‌దిలీపై వెళ్లిన ఆయ‌న 2011 అక్టోబ‌రులో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ప్ర‌మోష‌న్ పొందారు. ఈ ఏడాది జూన్ 22న రిటైర్ కానున్నారు.

జ‌స్టిస్ రంజ‌న్ గొగోయి

ప్రెస్ మీట్ పెట్టిన సీనియ‌ర్ సుప్రీం న్యాయ‌మూర్తుల్లో వీరి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సింది చాలానే ఉంది. ముందు బ్యాక్ గ్రౌండ్ చెప్పే బ‌దులు ఆయ‌న స్థాయి గురించి ప్ర‌స్తావించాల్సిందే. ఎందుకంటే.. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా త‌ర్వాత ఆ కుర్చీలో కూర్చునేది జ‌స్టిస్ రంజ‌న్ గొగోయి. జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా ఈ అక్టోబ‌రు 2న రిటైర్ కానుండ‌గా.. ఆ త‌ర్వాత ఆ ప‌ద‌విని చేప‌ట్టి చీఫ్ జ‌స్టిస్ గా 2019 న‌వంబ‌రు 17 వ‌ర‌కు వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అలాంటి ఆయ‌న‌.. ప్రెస్ మీట్ లో పాల్గొన‌ట‌మేకాదు.. విలేక‌రులు అడిగిన కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు.

1954 న‌వంబ‌రు 18న జ‌న్మించిన 1978లో లాయ‌రుగా గౌహ‌తి హైకోర్టులో ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. 2001లో గౌహ‌తీ హైకోర్టులో శాశ్విత జ‌డ్జిగా నియ‌మితుల‌య్యారు. 2010లో పంజాబ్‌.. హ‌ర్యానా హైకోర్టుకు బ‌దిలీ అయిన ఆయ‌న 2011లో అదే హైకోర్టుకు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా నియ‌మితుల‌య్యారు. 2012లో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ప్ర‌మోష‌న్ పొందారు. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ప‌ద‌విని చేప‌ట్టే వారిలో మొద‌టివ‌రుస‌లో ఉన్నారు.

జ‌డ్జిగా ఆయ‌న ఇచ్చిన ఆదేశాలు భారీ చ‌ర్చ‌కు తెర తీయ‌ట‌మే కాదు.. కీల‌క ఆదేశాలు ఇవ్వటంలో ఆయ‌న త‌ర్వాతే అన్న పేరు గొగోయ్ సొంతం. చ‌ట్ట‌స‌భ స‌భ్యుల కేసుల‌ను మాత్ర‌మే చేప‌ట్టేంందుకు 12 ప్ర‌త్యేక కోర్టులు మార్చి 1 నుంచి ప‌ని చేయాల‌ని గ‌త నెల‌లోనే ఆయ‌న నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఆదేశాలు జారీ చేసింది. ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టి వివాదానికి తెర తీసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి రిటైర్డ్ జ‌స్టిస్ మార్కండేయ క‌ట్జూ కోర్టు ధిక్కార‌ణ నోటీసును జారీ చేసింది గొగోయ్ బెంచే. అనంత‌రం క‌ట్జూ సుప్రీంకోర్టుకు హాజ‌రై క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అంతేకాదు.. అస్సాం పౌరుల జాతీయ రిజిస్ట‌ర్ కేసును విచారిస్తున్న జ‌స్టిస్ గొగోయ్ ధ‌ర్మాన‌స‌నం ఎన్ఆర్సీ ముసాయిదాను గ‌త ఏడాది ప్రింట్ చేయాల‌ని ఆదేశాలు ఇవ్వ‌గా.. అందులో జోక్యం చేసుకున్న అస్సాం ముఖ్య‌మంత్రి సోనోపాల్ ను త‌ప్ప ప‌ట్టింది ఆయ‌న నేతృత్వంలోని ధ‌ర్మాస‌న‌మే.

జ‌స్టిస్ కురియ‌న్ జోసెఫ్‌

ప్రెస్ మీట్ పెట్టిన సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌మూర్తులు న‌లుగురిలో ఇద్ద‌రు ద‌క్షిణాది రాష్ట్రాల‌కు చెందిన వారు ఉండ‌టం గ‌మ‌నార్హం. అందులో మొద‌టి వ్య‌క్తి జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్ అయితే.. రెండోవారు జ‌స్టిస్ కురియ‌న్ జోసెఫ్‌. కేర‌ళ‌లో 1953 న‌వంబ‌రులో పుట్టిన ఆయ‌న కాల‌డీ చెంగ‌ల్ లోని సెయింట్ జోసెఫ్ యూపీ స్కూల్‌.. కంజార్ సెయింట్ సెబాస్టియ‌న్ లో హైస్కూల్.. త్రిక్క‌క‌ర భార‌త్ మాతా కాలేజ్‌.. కాల‌డీ శ్రీ‌శంక‌ర కాలేజీల్లో ఆయ‌న చ‌దువుకున్నారు.

తిరువ‌నంత‌పురంలోని కేర‌ళ లా అకాడ‌మీ కాలేజీలో లా చ‌దువుకున్న ఆయ‌న 1979లో కేర‌ళ హైకోర్టులో లాయ‌ర్ గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు.

1987లో ప్ర‌భుత్వ న్యాయ‌వాదిగా నియ‌మితులైన ఆయ‌న‌.. 1994-96 వ‌ర‌కు అద‌న‌పు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ గా ప‌ని చేశారు. రెండుసార్లు కేర‌ళ హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర‌తిగా ప‌ని చేసిన ఆయ‌న 2010లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌ని చేశారు. 2013లో ప్ర‌మోష‌న్ మీద సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ ఏడాది న‌వంబ‌రు 29న రిటైర్ కానున్నారు. ట్రిఫుల్ త‌లాక్ ఆచారాన్ని ప‌క్క‌న పెడుతూ తీర్పును ఇచ్చిన ఐదుగురు స‌భ్యుల రాజ్యాంగ ధ‌ర్మాస‌నంలో వీరొక‌రు. క్రైస్త‌వుల‌కు శుభ‌దిన‌మైన గుడ్ ప్రైడే నాడు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి స‌ద‌స్సు ఏర్పాటు చేయ‌టాన్ని వ్య‌తిరేకిస్తూ 2015ఏప్రిల్ లో నాటి చీఫ్ జ‌స్టిస్ హెచ్ ఎల్ ద‌త్తుకు లేఖ రాయ‌టం దుమారాన్ని రేపింది.

జ‌స్టిస్ మ‌ద‌న్ బి లోకుర్‌

సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్లో చీఫ్ జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా త‌ర్వాత.. ప్రాధాన్య క్ర‌మంలో చూసిన‌ప్పుడు వీరు మూడో వ్య‌క్తిగా క‌నిపిస్తారు. చీఫ్ జ‌స్టిస్‌.. జ‌డ్జిలకు సంబంధించి.. వారి ప్రొఫైల్స్ ను వ‌రుస క్ర‌మంలో పెట్టిన వైనం చూసిన‌ప్పుడు చీఫ్ జ‌స్టిస్ ను మిన‌హాయిస్తే వీరి స్థానం మూడోది కావ‌టం గ‌మ‌నార్హం. 1953 డిసెంబ‌రు 31న జ‌న్మించిన ఆయ‌న ఢిల్లీలో స్కూలింగ్ చేశారు. అల‌హాబాద్ సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఐఎస్‌సీ ప‌రీక్ష పాస్ అయి.. ఢిల్లీ వ‌ర్సిటీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఢిల్లీ వ‌ర్సిటీలో లా పూర్తి చేసిన ఆయ‌న 1977లో లాయ‌ర్ గా న‌మోదు చేసుకొన్నారు. సుప్రీంకోర్టు.. ఢిల్లీ హైకోర్టులో లాయ‌ర్ గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన ఆయ‌న 1988లో అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ గా నియ‌మితుల‌య్యారు.

ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌ని చేసిన ఆయ‌న ఆ త‌ర్వాత గౌహ‌తి హైకోర్టులో ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌ని చేశారు. 2011 నుంచి 2012 వ‌ర‌కు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా అపాయింట్ అయ్యారు. ఈ ఏడాది డిసెంబ‌రు 30న రిటైర్ కానున్నారు. 18 ఏళ్ల కంటే చిన్న వ‌య‌సు ఉన్న బాలిక‌ల‌తో భ‌ర్త సైతం లైంగిక కార్యం పాల్గొన‌టాన్ని నేరంగా ప‌రిగ‌ణించే చారిత్ర‌క తీర‌పును ఇచ్చింది వీరే.