Begin typing your search above and press return to search.

మాజీ ప్ర‌ధాని స్కెచ్ మామూలుగా లేదు

By:  Tupaki Desk   |   10 Nov 2015 7:46 AM GMT
మాజీ ప్ర‌ధాని స్కెచ్ మామూలుగా లేదు
X
బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి విజయదుందుభి మోగించడం, ఎన్డీఏ కూట‌మి ఓటమి పాలవడం దేశ రాజ‌కీయాల్లో కొత్త స‌మీక‌ర‌ణాల‌కు...స‌రికొత్త ఆశ‌ల‌కు అంకుర‌మ‌యింది. ఇప్ప‌టికే నితీశ్‌ కుమార్‌ ను భవిష్య‌త్ ప్ర‌త్యామ్నాయ నేత‌గా చూపేందుకు ప‌లు రాజ‌కీయ పార్టీలు త‌మ‌వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. మోడీకి స‌రైన ప్ర‌త్య‌ర్థి నితీశేన‌ని భావిస్తూ మ‌రికొన్ని పార్టీలు త‌మ క‌ల‌ల భ‌విష్య‌త్‌ కు నిచ్చెన‌లు వేస్తున్నాయి. తాజాగా పొరుగు రాష్ర్టం క‌ర్ణాట‌క‌లో ఇదే త‌ర‌హా ప‌రిణామం చోటుచేసుకుంది.

బీహార్ ఫ‌లితాలు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ప్రభావాన్నే చూపిస్తోంది. జనతా పరివార్ పేరుతో గ‌తంలో ఏక‌మైన ఆయా పార్టీల‌ను చిలువ‌లు ప‌లువ‌లుగా చీలిన సంగ‌తి తెలిసిందే. మ‌రోమారు వాటిని ఏకం చేయడానికి మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత‌ దేవెగౌడ నడుంకట్టారు. ఈ క్ర‌మంలో కాంగ్రేసేత‌ర ప‌క్షాల‌న్నింటినీ కూడ‌గ‌ట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. క‌ర్ణాట‌క‌ కాంగ్రెస్‌ పార్టీతో సఖ్యంగా మెలగాలనుకుంటున్న‌ట్లు దేవేగౌడ సిగ్న‌ల్స్ పంపారు. ఇందులో భాగంగా బెంగళూరు నగర కార్పొరేషన్‌ అధికార పంపిణీ విషయంలో కాంగ్రెస్‌ - జేడీఎస్‌ లు ఒక్కటయ్యాయి. కర్ణాటక రాష్ట్ర సీపీఎం శాఖతో త‌న సొంత పార్టీ జేడీఎస్‌ కు స్నేహసంబంధాలే ఉన్న నేప‌థ్యంలో వాటిని మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతోపాటు త్వరలోనే దేవెగౌడ జ‌న‌తాద‌ళ్‌(యు) నాయకుడు శరద్‌ యాదవ్‌ ను - కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని - సీపీఐ - సీపీఎం నాయకులను కలుసుకోనున్నారని స‌మాచారాం.

చిత్రంగా క‌ర్ణాటకలో ఇప్పటికిప్పుడు ఎన్నికలేవీ లేవు. అయిన‌ప్పటికీ, త్వరలోనే వచ్చే జిల్లా, తాలూకా స్థాయి ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీయాలన్నది దేవెగౌడ వ్యూహం. మొత్తంగా తాజా ప్ర‌ధానిని దెబ్బ‌కొట్టేందుకు ఈ మాజీ ప్ర‌ధాని పెద్ద ఎత్తున్నే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ ప్ర‌య‌త్నం ఎంత‌మేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి మ‌రి.