Begin typing your search above and press return to search.

కన్నడ సంకీర్ణ పంచాయతీ ఢిల్లీ చేరింది..ఫలితమేంటో?

By:  Tupaki Desk   |   11 Jun 2019 2:02 PM GMT
కన్నడ సంకీర్ణ పంచాయతీ ఢిల్లీ చేరింది..ఫలితమేంటో?
X
కన్నడ సంకీర్ణ పంచాయతీ ఆ రాష్ట్ర సరిహద్దులను దాటేసి హస్తినకు చేరింది. రెండేళ్ల నాడు కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా... మెజారిటీకి కాస్తంత దూరంగా నిలిచింది. ఈ క్రమంలో బీజేపీని అడ్డుకునే వ్యూహాన్ని రచించిన కాంగ్రెస్ పార్టీ తనకు ఎక్కువ సీట్లు వచ్చినా కూడా తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్ కు సీఎం పోస్టు ఇచ్చింది. దీంతో కింగ్ మేకర్ ను అవుతాననుకున్న జేడీఎస్ నేత కుమారస్వామి ఏకంగా కింగే అయిపోయారు. అయితే సంకీర్ణంలో కీలక భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు సంకీర్ణ సర్కారుకు ఇబ్బందులే సృష్టిస్తోంది. అసలు కుమారస్వామి స్వేచ్ఛగా పనిచేసుకునే వాతారణమే లేకుండా పోయింది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణతో పాటు రాష్ట్రంలో ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా కూడా సాధ్యం కాని పరిస్థితి నెలకొంది.

మరోవైపు ఎప్పుడెప్పుడు సంకీర్ణ సర్కారును కూలదోసేసి అధికారాన్ని చేజిక్కించుకుందామా అంటూ గోతికాడి నక్కలా బీజేపీ కాసుక్కూర్చుని ఉంది. కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలను కొనేందుకు కూడా వెనునకాడటం లేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య కూడా సంకీర్ణానికి చుక్కలు చూపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీతో వేగేదెలా అంటూ కుమార ఇబ్బందులు పడుతుండగా... ఆయన తండ్రిగా, జేడీఎస్ అధినేతగా రంగంలోకి దిగిపోయిన మాజీ ప్రధాని దేవేగౌడ... హస్తినలో ల్యాండయ్యారు.

మంగళవారం ఢిల్లీకి వెళ్లిన దేవేగౌడ నేరుగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. సంకీర్ణలో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించారు. సంకీర్ణంలోని కీలక బాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచే ఇబ్బందులు ఎదురైతే ఎలాగంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా సమస్యలన్నింటికీ సిద్దూనే కారణమంటూ ఆయన రాహుల్ కు కంప్లైంట్ చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే... సంకీర్ణ సర్కారు మనుగడ కష్టమేనని, ఒకవేళ సంకీర్ణం కూలితే మాత్రం అది కాంగ్రెస్... ప్రత్యేకించి సిద్దూ పుణ్యమేనని కూడా దేవేగౌడ కాస్తంత లెంగ్తీగానే కంప్లైంట్ చేశారట. దేవేగౌడ చెప్పిన విషయాలన్నీ విన్న రాహుల్... ఏమన్నారో తెలియదు గానీ... కనీసం ఆయన జోక్యంతో అయినా కన్నడ సంకీర్ణ సర్కారు పాలన సాఫీగా సాగేనా అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.