Begin typing your search above and press return to search.

ముంద‌స్తు మీద దేవెగౌడ మాట కూడా ఇదే!

By:  Tupaki Desk   |   29 Jun 2018 6:09 AM GMT
ముంద‌స్తు మీద దేవెగౌడ మాట కూడా ఇదే!
X
షెడ్యూల్ కంటే ముందుగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌న్న ఆలోచ‌న‌లో మోడీ స‌ర్కారు ఉన్న‌ట్లుగా మీడియాలో వార్త‌లు వ‌స్తున్న వైనం తెలిసిందే. డిసెంబ‌రులో ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న వాద‌న‌కు భిన్నంగా.. అక్టోబ‌రులోనే వ‌చ్చేస్తాయ‌న్న స‌రికొత్త అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కొన్ని మీడియా సంస్థ‌లు చేస్తున్న విశ్లేష‌ణ‌లు చూస్తే.. ఈ క‌థ‌నాల వెనుక అంతో ఇంతో నిజం ఉంద‌న్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.

దీనికి తోడు మోడీ స‌ర్కారు వేస్తున్న అడుగులు ఎన్నిక‌ల‌కు ముందు ఎలాంటి స‌న్న‌ద్ధ‌త ఉందో.. అదే తీరును ప్ర‌ద‌ర్శించ‌టంతో దేశ వ్యాప్తంగా ఇప్పుడు రాజ‌కీయం వేడెక్కుతోంది. రానున్న కొద్ది నెలల్లో ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉన్నందున‌.. సార్వ‌త్రికాన్ని ఒక‌సారి.. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్ని మ‌రోసారి నిర్వ‌హించే క‌న్నా.. ఒకేసారి అన్ని ఎన్నిక‌ల్ని నిర్వ‌హించ‌టం ద్వారా రాజ‌కీయ ల‌బ్థిని పొందాల‌ని బీజేపీ భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఈ వాద‌న‌పై తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ సైతం పాజిటివ్ గా రియాక్ట్ కావ‌టం గ‌మ‌నార్హం. డిసెంబ‌రులో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. రాజ‌స్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయి.. వీటితో పాటు లోక్ స‌భ‌కు ఎన్నిక‌లు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానించారు.

బీజేపీ చేస్తున్న స‌న్నాహాలు చూస్తుంటే.. గ‌డువు కంటే ముందుగా ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌న్న‌ట్లుగా ఆ పార్టీ తీరు ఉంద‌న్నారు. లోక్ స‌భ‌కు.. అసెంబ్లీకి ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌నే కేంద్రం ఆలోచ‌న‌ను ఒడిశా సీఎం.. యూపీ మాజీ సీఎం కూడా స‌మ‌ర్థించ‌టాన్ని గుర్తు చేశారు. లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్‌.. జేడీఎస్ రెండూ క‌లిసి బ‌రిలోకి దిగుతాయ‌ని స్ప‌ష్టం చేసిన ఆయ‌న‌.. బీఎస్పీతో త‌మ‌కు పొత్తున్న స్థానాన్ని ఆ పార్టీకి కేటాయించ‌నున్న‌ట్లుగా చెప్పారు. క‌ర్ణాట‌క‌లో ప్ర‌భుత్వం రెండు.. మూడు రోజుల్లో కూలిపోయేంత బ‌ల‌హీనంగా లేద‌న్న ఆయ‌న‌.. కుమార‌స్వామి స‌ర్కారు ఐదేళ్ల పాటు సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ముంద‌స్తు విష‌యంలో మోడీ ఆలోచ‌న‌ను చ‌దివేసిన‌ట్లుగా చెబుతున్న దేవెగౌడ అంచ‌నాలు ఎంత‌వ‌ర‌కూ నిజ‌మ‌వుతాయో కాల‌మే చెప్పాలి.