Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫ్రంట్‌ కు మాజీ ప్ర‌ధాని మ‌ద్ద‌తు

By:  Tupaki Desk   |   27 March 2018 4:18 AM GMT
కేసీఆర్ ఫ్రంట్‌ కు మాజీ ప్ర‌ధాని మ‌ద్ద‌తు
X
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు దేశంలోని ప్రాంతీయపార్టీలతో కలిపి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఓ వైపు జాతీయ పార్టీల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తుంటే...మ‌రోవైపు అనూహ్య‌ వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు సైతం ద‌క్కుతోంది. తాజాగా మాజీ ప్రధాన మంత్రి - జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ కేసీఆర్ ఫ్రంట్‌ ను స్వాగ‌తించారు. కర్ణాటక శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని బెంగళూరులోని ఓ హోటల్‌ లో దేవేగౌడ మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ - బీజేపీలను ఇక ఆదరించే పరిస్థితిలేదన్నారు. ఒక్క కర్ణాటకనే కాదు.. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉన్నదని మాజీ ప్ర‌ధాని తేల్చేశారు.

దేశంలోని అనేకమంది బీజేపీ - కాంగ్రెస్ పార్టీల వైఖరితో విసిగిపోయారని - వీరికి దూరంగా కొత్త రాజకీయాలను కోరుకుంటున్నారని దేవేగౌడ‌ చెప్పారు. త్వరలో జరుగనున్న దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. కొంతమంది బీజేపీ ముక్త్ భారత్‌ ను కోరుతుంటే మరికొంత మంది కాంగ్రెస్ ముక్త్ భారత్‌ ను కోరుతున్నారని - మరికొంతమంది కాంగ్రెస్ - బీజేపీ ముక్త్ భారత్‌ ను కోరుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్ర‌తిపాదించిన ఫెడ‌రల్ ఫ్రంట్ మంచి పరిణామంగా దేవేగౌడ‌ అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో తనకు పరిచయం ఉన్నదని - ఆయనతో అనేక సందర్భాల్లో మాట్లాడానన్నారు. ఫెడరల్ ఫ్రంట్ యోచనపై కూడా తనతో చర్చించారని దేవేగౌడ తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల అనంతరం ఫెడరల్ ఫ్రంట్‌ పై దృష్టిసారిస్తానని - చర్చిస్తానని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఉన్నదని - ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టిసారిస్తానని తెలిపారు. కర్ణాటక ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఇక్కడ జేడీఎస్ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఉన్నదని చెప్పారు. ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం తమకున్నదని దేవేగౌడ ధీమా వ్య‌క్తం చేశారు.