Begin typing your search above and press return to search.

నిట్టూర్పులోనే అదిరే పంచ్ వేసిన దేవ‌గౌడ్

By:  Tupaki Desk   |   26 Dec 2018 8:19 AM GMT
నిట్టూర్పులోనే అదిరే పంచ్ వేసిన దేవ‌గౌడ్
X
చురుకైన ప్ర‌ధాని పేర్లు చెప్ప‌మంటే దేవెగౌడ పేరును దాదాపుగా ఎవ‌రూ చెప్ప‌ని ప‌రిస్థితి. దానికి కార‌ణం లేక‌పోలేదు. ఎంత పెద్ద బ‌హిరంగ స‌భ అయినా.. మ‌రెంత పెద్ద కార్య‌క్ర‌మైనా.. కూర్చున్న సీట్లో కునుకు తీయ‌కుండా ఆయ‌న ఉండ‌లేరు. నిద్రాదేవ‌త‌ను చంక‌లో పెట్టుకొని తిరిగే దేవెగౌడ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు ఎంత దూర‌దృష్టితో తీసుకున్న‌వో చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే.

నిన్న మోడీ మాష్టారి య‌మా గొప్ప‌గా ప్రారంభించిన రైలు-రోడ్డు వంతెన ప్రాజెక్టు గుర్తుందా? అసోంలోని బోగీబీల్‌లో ప్రారంభించిన ఈ వంతెన‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంది. దేశంలోనే అత్యంత పొడ‌వైన రైలు క‌మ్ రోడ్డు వంతెగా చెప్పాలి. ఆ ప్రాజెక్టును ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలుసా? అక్ష‌రాల 21 ఏళ్ల క్రితం.

నిద్ర‌లో జోగిన‌ట్లు ఉండే దేవెగౌడ సారు ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆ ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేసి.. రూ.100 కోట్లు నిధులు కేటాయించారు. ఆయ‌న త‌ర్వాత చాలామంది ప్ర‌ధానమంత్రులు వ‌చ్చినా..ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. 21 ఏళ్ల సుదీర్ఘ కాలం పూర్తి అయ్యాక‌.. తాజాగా దాన్ని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి నాటి ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రించిన దేవెగౌడ‌ను ఆహ్వానించ‌లేదు.

విష‌యం ఏదైనా కానీ ప‌రాయి వాళ్ల‌కు చిన్న‌మెత్తు క్రెడిట్ పోతుందంటే అస్స‌లు త‌ట్టుకోలేని మోడీ మాష్టారు.. అప్పుడెప్పుడో దేవగౌడ్ సారు పునాది రాయి వేసిన ప్రాజెక్టుకు అతిధిగా ఎందుకు పిలుస్తారు చెప్పండి? ఆయ‌న కానీ సీన్లోకి వ‌స్తే.. 21 ఏళ్ల మాట బ‌య‌ట‌కు రావ‌టం.. మోడీ మాష్టారి ప‌రువు త‌క్కువ కావ‌టం కామ‌న్.

అందుకే.. క‌న్న‌డ పెద్దాయ‌న్ను లైట్ తీసుకుంటూ.. ఆయ‌న‌కు ఆహ్వాన‌మే పంప‌లేదు. అయితే.. ఇలాంటి విష‌యాల్ని తెర మీద‌కు తీసుకురావ‌టంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే మీడియా ఊరికే ఉండ‌దు క‌దా? దౌవెగౌడ మాష్టారి ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. అయ్యా.. వంతెన ప్రారంభోత్స‌వానికి మీరు వెళ్ల‌లేదే? మీకు ఆహ్వానం వ‌చ్చిందా? అడిగారు. ఇలాంటి ప్ర‌శ్న కోస‌మే ఎదురుచూస్తున్నారేమో కానీ.. దేవెగౌడ వెంట‌నే స్పందించి.. అయ్యో రామా.. న‌న్నెవ‌రు గుర్తుకు పెట్టుకుంటారు? మ‌హా అయితే కొన్ని ప‌త్రిక‌ల్లో నా గురించి రాసి ఉండొచ్చు. నేను ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో క‌శ్మీర్ కు రైల్వే లైను.. ఢిల్లీ మెట్రో.. బోగీబీల్ వంతెన ప్రాజెక్టుల్ని మంజూరు చేసి.. ఒక్కో ప్రాజెక్టుకు రూ.100 కోట్ల నిధుల్ని కేటాయించామ‌ని చెప్పారు.

వంతెన నిర్మాణం కోసం 21 ఏళ్లా? అన్న ప్ర‌శ్న‌కు.. ఎదుటోళ్ల త‌ప్పుల్ని ఎత్తు చూప‌ని దేవెగౌడ‌.. తాను హ‌స‌న్- మైసూర్ ప్రాజెక్టును 13 నెల‌ల్లో పూర్తి చేశానని.. మ‌రో రెండు ప్రాజెక్టుల‌ను కూడా చెప్పిన స‌మ‌యానికే పూర్తి చేసినట్లుగా చెబుతూ.. మోడీకి చేత‌కానిది.. త‌న‌కు చేత‌నైన విష‌యాన్ని ఎంత చ‌క్క‌గా చెప్పారో క‌దా? ప్ర‌త్య‌ర్థుల్ని లాగి పెట్టి కొట్టిన‌ట్లుగా తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేసే క‌న్నా.. సుతిమెత్త‌గా దేవెగౌడ మాష్టారి దెబ్బ‌ల తీవ్ర‌తే ఎక్కువ‌గా ఉంటుంది కూదా!