Begin typing your search above and press return to search.

తెలుగు స్టేట్స్ లో బీజేపీ కి ఓటు అడిగే హక్కు లేదా ?

By:  Tupaki Desk   |   10 Aug 2019 2:30 PM GMT
తెలుగు స్టేట్స్ లో బీజేపీ కి ఓటు అడిగే హక్కు లేదా ?
X
దక్షిణాదిలో ఎలాగైనా పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న బీజేపీ తన అసలు అజెండా మరిచి రాజకీయ అజెండాను అమలు చేసే పనిలో పడింది. ఇంతకాలం ‘సబ్‌ కా వికాస్ సబ్‌ కా సాథ్’ అని చెబుతూ వచ్చిన బీజేపీ ఏపీ, తెలంగాణ విషయంలో ఎందుకో ఆ సంగతే మర్చిపోతోంది. అభివృద్ధి మాట పక్కన పెట్టి పూర్తిగా దురాశా రాజకీయాలు చేస్తోందని తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి పరిశీలిస్తున్న విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ దీనిపై చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి బలం లేదని.. ఒకరిద్దరు నేతలు స్వీయ శక్తితో పార్టీలో ఎదగడమే కానీ పార్టీ జనంలో లేదన్నది ఆ చర్చల్లో సారాంశం.

ముఖ్యంగా పార్టీని విస్తరించాలన్న ఆశలో పడి ఇతర పార్టీల నుంచి చిన్నచితకా నేతల నుంచి పైస్థాయి నేతల వరకు ఎవరు వచ్చినా తీసుకునేందుకు తొందరపడడం కనిపిస్తోంది. విశ్వసనీయత గల పార్టీగా గొప్పలు చెప్పుకొనే బీజేపీ ఈ క్రమంలో నాయకుల చరిత్ర, స్థాయి మరిచి వారికి కాషాయ కండువాలు కప్పుతున్న ఉదంతాలూ ఉన్నాయి. తన రాజకీయ చర్యల కారణంగా పూర్తిగా అన్ పాపులర్ అయి, దాదాపుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఓ మాజీ సీఎంను ఇటీవల బీజేపీలో చేర్చుకోవడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన కొన్ని కీలక ప్రాజెక్టులకు ఏమాత్రం సహకరించకుండా ప్రగతిని దెబ్బతీస్తున్న బీజేపీ పార్టీని విస్తరించడానికి మాత్రం అతి వేగం చూపిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ తెలంగాణలో మాత్రం ఒక సీటు గెలుచుకుంది. దాంతో రెండు రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది.

తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ ప్రభుత్వం తమ రాష్ట్రానికి న్యాయం చేసేలా, ప్రగతికి సహకరించేలా ప్రాతినిధ్యం వహించడం మానేసి తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల నేతలను ఇబ్బంది పెట్టడం.. అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం చేస్తోందని నెటిజనులు ఆరోపిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజధాని కూడా లేకుండా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ వంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి రాజధాని అభివృద్ధికి కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ.. అటు తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టులకు కానీ నిధులివ్వడం మానేసి... ఇతర పార్టీలనుంచి ఎవరిని లాగుదామా అన్న ఆలోచనలో మాత్రమే ఉందని ఆరోపణలు గుప్పిస్తున్నారు.