Begin typing your search above and press return to search.

బాబుకు మ‌స్తు సన్నిహితుడు బీజేపీలోకి!

By:  Tupaki Desk   |   9 Jun 2019 12:06 PM GMT
బాబుకు మ‌స్తు సన్నిహితుడు బీజేపీలోకి!
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న దేవెంద‌ర్ గౌడ్‌.. ఆయ‌న కుమారులు సైతం పార్టీ మారేందుకు రెఢీ అవుతున్నారు. ఇప్ప‌టికే ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యాన్ని చ‌విచూసిన బాబు.. తెలంగాణ‌లో పార్టీని బ‌లోపేతం చేసేందుకు తాను వారంలో రెండు రోజులు కేటాయించ‌నున్న‌ట్లుగా చెప్పారు. తెలంగాణ‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని దారుణ‌మైన పొర‌పాటు చేయ‌టం ఒక ఎత్తు అయితే.. తెలంగాణ‌లో ప్ర‌చారం చేయ‌టానికి వ‌చ్చిన బాబు కార‌ణంగా ఘోర‌మైన ఓట‌మి చెందిన‌ట్లుగా చెబుతారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత వెలువ‌డిన ఫ‌లితాల‌తో తెలంగాణ‌లో టీడీపీకి చోటు లేద‌న్న విష‌యాన్ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు ప్ర‌స్తావిస్తున్న వేళ‌.. ఆ పార్టీలో మిగిలిన నేత‌లంతా త‌మ దారి తాము చూసుకోవ‌టానికి వీలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఆశ్చ‌ర్య‌క‌రంగా నాలుగు ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకున్న బీజేపీవైపు ఇప్పుడు తెలుగు త‌మ్ముళ్లు దృష్టి సారించిన‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టికే పెద్దిరెడ్డితో పాటు.. చాడా సురేశ్ రెడ్డితో స‌హా ప‌లువురు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత‌ల‌పై బీజేపీ వ‌ల విసిరిన‌ట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ‌లో కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ‌.. కేంద్రంలో ప‌వ‌ర్లో ఉన్న బీజేపీ వెంట వెళ్ల‌టం మంచిద‌న్న భావ‌న‌కు వ‌స్తున్న‌ట్లు చెప్ప‌క త‌ప్ప‌దు. దేవెంద‌ర్ రెడ్డి బీజేపీలోకి వెళుతున్న విష‌యాన్ని ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న కానీ.. బీజేపీ కానీ ఎవ‌రూ స్పందించ‌లేదు. కాకుంటే.. ఇందుకు సంబంధించిన ప్ర‌య‌త్నాలు తెర వెనుక సాగుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

దీనికి తోడు తెలంగాణ‌లో పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌టంతో పాటు.. బ‌ల‌హీన‌మైన కాంగ్రెస్ స్థానాన్ని తాము చేజిక్కించుకోవ‌టం కోసం బీజేపీ వ్యూహ‌క‌ర్త‌లు తెలంగాణ మీద దృష్టి సారించిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ క్ర‌మంలో బ‌ల‌మైన నేత‌లు.. ప్ర‌జల్లో ప‌లుకుబ‌డి ఉన్న నేత‌లు ప‌లువురిని పార్టీలో చేసుకునే దిశ‌గా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో బాబుకు నిన్న‌టి వ‌ర‌కూ స‌న్నిహితంగా ఉన్న వారు.. ఒక్కొక్క‌రూ వెళ్లిపోతున్న వైనం చూస్తే.. తెలంగాణ‌లో తెలుగుదేశం ఉనికి ఇక ప్ర‌శ్నార్థ‌క‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.