Begin typing your search above and press return to search.

ముంబ‌యి వాసుల్ని ఇళ్ల‌ల్లో నుంచి రావ‌ద్ద‌న్న సీఎం

By:  Tupaki Desk   |   29 Aug 2017 5:20 PM GMT
ముంబ‌యి వాసుల్ని ఇళ్ల‌ల్లో నుంచి రావ‌ద్ద‌న్న సీఎం
X
వ‌రుస పెట్టి కురుస్తున్న వ‌ర్షం.. దాని కార‌ణంగా చోటు చేసుకున్న వ‌ర‌ద‌ల కార‌ణంగా దేశ ఆర్థిక రాజ‌ధానిలో ప్ర‌జా జీవ‌నం స్తంభించిపోయింది. ఇప్పుడక్క‌డ ఎంత దారుణ ప‌రిస్థితి ఉందంటే.. ఎంతో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఉంటే త‌ప్పించి ముంబ‌యి పౌరుల్ని ఇళ్ల‌ల్లో నుంచి బ‌య‌ట‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో రావొద్దంటూ మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కోరారు.

రోడ్ల మీద భారీగా వ‌ర్ష‌పు నీరు నిలిచిపోవ‌టంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని.. అందుకే ఇళ్ల‌ల్లో నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని ఆయ‌న కోరుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటించాల‌ని ఎవ‌రికైనా ఏదైనా స‌మ‌స్య ఎదురైతే త‌న‌కు ట్వీట్ కానీ ఫోన్ కానీ చేయాల‌న్నారు.

లోత‌ట్టు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల్ని కాపాడేందుకు ఇప్ప‌టికే రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగిన‌ట్లుగా వెల్ల‌డించారు. ప్ర‌జ‌లు కార్ల‌లో ప్ర‌యాణించొద్ద‌ని.. బ‌స్సుల్లోనే జ‌ర్నీ చేయాల‌ని కోరారు. ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో కొన్ని రైల్వే స‌ర్వీసుల్ని నిలిపివేయ‌గా.. ప్ర‌తికూల వాతావ‌ర‌ణంతో ముంబ‌యిలో విమాన స‌ర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేశారు.

ముంబ‌యిలోని అతి పెద్ద మున్సిప‌ల్ ఆసుప‌త్రి అయిన కేఈఎంలోకి వ‌రద నీరు వ‌చ్చి చేర‌టంతో అక్క‌డున్న రోగుల్ని వేరే ప్ర‌దేశానికి త‌ర‌లించారు. ఎడ‌తెర‌పిలేకుండా కురుస్తున్న వ‌ర్షంతో ముంబ‌యి రోడ్ల మీద కార్ల టైర్లు మునిగిపోయేలా వ‌ర్ష‌పు నీరు ఉంటే.. కార్ల‌లోని వారు బ‌య‌ట‌కు వ‌చ్చేయాల‌ని.. కార్ల‌ను విడిచి పెట్టేయాల‌ని ముంబ‌యి పోలీసులు కోరుతున్నారు. అలాంటి వేళ‌లో కార్ల‌లో ఉండ‌టం ఏ మాత్రం క్షేమ‌క‌రం కాద‌ని.. అందులోని నుంచి వ‌చ్చేయాల‌ని వార్నింగ్ ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే.. రాబోయే మూడు రోజుల్లో మ‌రింత భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చరిస్తోంది. దీంతో.. ఎప్పుడేం జ‌రుగుతుందో అర్థం కాక అటు ప్ర‌భుత్వ యంత్రాంగంతో పాటు.. ప్ర‌జ‌లు బిక్కుబిక్కు మంటున్నారు. ప్ర‌కృతి ప్ర‌కోపాన్ని నేరుగా చ‌విచూస్తున్న ముంబ‌యి వాసులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. మార్గ‌మ‌ధ్యంలో ఇరుక్కుపోయిన వారు త‌మ గ‌మ్య‌స్థానాలు చేరుకునేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. అత్య‌వ‌స‌ర సాయం కోసం బీఎంసీ ఎమ‌ర్జెన్సీ నెంబ‌రు 1916కు ఫోన్ చేయాల‌ని కోరుతున్నారు.